రూ.8.44 కోట్ల నగదు స్వాధీనం

May 10,2024 00:28 #krishna

– భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టి భారీగా నగదు, మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద రూ.8.40 కోట్లను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నగదుతోపాటు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.2,96,500, పశ్చిమ నియోజకవర్గంలో రూ.42,500, మంగళగిరిలో రూ.87,500 నగదును సీజ్‌ చేశారు. తాడికొండలో రూ.35 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ మొత్తం రూ.3,64,11,311ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్‌ చేశారు.
భారీగా మద్యం స్వాధీనం
ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో భారీగా నిల్వ ఉంచిన 10 వేల మద్యం సీసాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మద్యం నిల్వలపై విచారణ చేపట్టామని, బాధ్యుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అదే పట్టణంలో బుధవారం రాత్రి ఆటోలో తరలిస్తున్న సుమారు 40 కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతో సహా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.5 లక్షలకుపైగా ఉంటుందని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 1812 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఓటర్లకు పంచడానికి మద్యం బాటిళ్లను ఆటోలో తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టి ఆటోతోపాటు, 1515 మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు. సత్తెనపల్లి విక్టరీ బార్‌ నుండి ద్విచక్ర వాహనాలపై మూడు గోతాల్లో 297 మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

➡️