గుంటూరు లోక్‌సభకు ఆసక్తికర పోరు

May 11,2024 00:16 #guntur

– టిడిపి, వైసిపి ఫలితాలపై ప్రభావం
చూపనున్న సిపిఐ
ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి :రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టిడిపి, వైసిపి అభ్యర్థుల గెలుపు మధ్య పోటీ నువ్వా నేనా అన్న చందంగా జరుగుతున్నా.. ఇండియా బ్లాక్‌ తరపున పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ ఫలితాలను తీవ్ర ప్రభావితం చేయనున్నారు. బిజెపితో పొత్తు వల్ల టిడిపికి కొన్ని సామాజిక తరగతుల ఓటర్లు దూరమయ్యారు.
జిల్లాలో వామపక్షాలకు మంచి పట్టుంది. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఊపిరిలూదిన సిపిఎం, సిపిఐ కలిసి ఇప్పుడు ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్యపక్షాలుగా ఉండటం, కాంగ్రెస్‌ కూడా ఇందులో కీలక భూమిక పోషించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓట్లు ఇండియా బ్లాక్‌ అభ్యర్థులకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న జంగాల అజరుకుమార్‌ పోటీ వల్ల వామపక్షాలు, కాంగ్రెస్‌ మద్దతుతో గణనీయమైన ఓట్లను సాధించే అవకాశం ఉంది.

డబ్బే ప్రామాణికం
వైసిపి నుంచి కిలారి రోశయ్య, టిడిపి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం డబ్బే ప్రామాణికంగా టిడిపి, వైసిపి అభ్యర్థులు ప్రచారంలో తమదైన శైలి కనబరుస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆస్తి రూ.5,785 కోట్ల వరకు ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. దేశం మొత్తమ్మీద ఇంత ధనిక అభ్యర్థిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన ఎన్నికల్లో భారీగా ఖర్చుపెడతారన్న ఉద్దేశంతో టిడిపి ఆయనకు లోక్‌సభ టికెట్టు ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులకు కూడా పెమ్మసాని ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిసింది. అలాగే మిర్చితో పాటు అనేక వ్యాపారాలు నిర్వహించే రోశయ్య.. ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్‌ను ఢ కొంటున్నారు. రోశయ్య తాను పక్కా లోకల్‌ అనే నినాదంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజధాని జిల్లాలో వైసిపికి కొంత ప్రతికూలత కనిపిస్తోంది. అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన సిఎం జగన్‌ 2019 డిసెంబరులో మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో మొత్తం రాజధాని రైతులు తీవ్ర నిరసన తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా రైతులు 1600 రోజులుగా ఉద్యమం నిర్వహించారు.

ఎన్నికల ఫలితాల్లో కీలకంగా రాజధాని అంశం
రాజధాని అంశం కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో కీలక భూమిక పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజధాని అమరావతిని సిఎం జగన్‌ నిర్వీర్యం చేసినా వైసిపి ఎమ్మెల్యేలు ఎవరూ అడ్డుకోలేదని, అందువల్ల వీరికి ఓటమి తప్పదని టిడిపి లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వైసిపి ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత, గ్రూపు రాజకీయాలు వైసిపికి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలపై నిరంతరం పోరాటాలు, ప్రజల మధ్య ఉండే సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ టిడిపి, వైసిపిల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారు. a

➡️