హోరాహోరీ పశ్చిమ బరి

May 10,2024 00:03 #Eluru district

– వైసిపి, టిడిపి కూటమి, ఇండియా బ్లాక్‌ ముమ్మర ప్రచారం
– నరసాపురంలో బిజెపి గెలుపు అంత ఈజీ కాదు
– బెట్టింగ్‌లో జోరు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి :పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఆర్థికంగానూ, ఆయా సామాజిక తరగతుల పరంగానూ బలవంతులు కావడంతో తాజా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు కోసం టిడిపి కూటమి, వైసిపి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతుండగా ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తున్నారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. నరసాపురం ఎంపి స్థానానికి బిజెపి తరపున బి శ్రీనివాసవర్మ, వైసిపి నుంచి గూడూరి ఉమాబాల, కాంగ్రెస్‌ నుంచి కెబిఆర్‌ నాయుడు బరిలో ఉన్నారు. ఎంపీ స్థానానికి పోరు హోరాహోరీగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వైసిపి శెట్టిబలిజ సామాజిక తరగతికి చెందిన గూడూరి ఉమాబాలకు టిక్కెట్‌ ఇచ్చింది. బిజెపి గతంలో మాదిరిగానే క్షత్రియ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థిని బరిలో దింపింది. కాంగ్రెస్‌ నుంచి కాపు సామాజిక తరగతికి చెందిన అభ్యర్థి బరిలో ఉన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులకు ధీటుగా టిడిపి కూటమి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ లోక్‌సభకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి నచ్చిన పార్టీకి ఓటేసుకుని ఎంపీ ఓటు మాత్రం వైసిపి అభ్యర్థి గూడూరి ఉమాబాలకు వేయాలని శెట్టిబలిజ సామాజిక తరగతికి చెందిన కొందరు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఈ తరగతి ఓట్లు అత్యధికంగా ఉండడంతో బిజెపి ఓటమి ఖాయమనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కెబిఆర్‌ నాయుడు పెద్దఎత్తున ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ స్థానాల్లోనూ నువ్వా..నేనా
ఆచంటలో పితాని సత్యనారాయణ టిడిపి నుంచి, చెరుకువాడ రంగనాథరాజు వైసిపి నుంచి, నెక్కంటి వెంకటసత్యనారాయణ కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. పాలకొల్లులో టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు మళ్లీ గెలిచి హాట్రిక్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు నెరవేరకుండా వైసిపి అభ్యర్థి గుడాల గోపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి కె అర్జునరావు తమదైన శైలిలో పట్టు బిగిస్తున్నారు. నరసాపురంలో జనసేన అభ్యర్ధిగా బి నాయకర్‌, వైసిపి నుంచి ఎం ప్రసాదరాజు, కాంగ్రెస్‌ నుంచి కె బుజ్జి పోటీలో ఉన్నారు. రెండోసారి ఎంఎల్‌ఎగా గెలవాలని వైసిపి అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. భీమవరంలో జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు, వైసిపి నుంచి గ్రంధి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి ఎ.సీతారాం పోటీపడుతున్నారు. వరుసగా రెండోసారి విజయం సాధించాలని వైసిపి అభ్యర్థి ముందుకు సాగుతుండగా, ఈ సారి గెలిచేందుకు జనసేన వ్యూహాలు పన్నుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి సైతం పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉండిలో టిడిపి నుంచి కె రఘురామకృష్ణంరాజు, వైసిపి నుంచి పివిఎల్‌ నరసింహరాజు, కాంగ్రెస్‌ నుంచి వి గోపాలకృష్ణంరాజు, టిడిపి రెబల్‌ అభ్యర్థి వి శివరామరాజు ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంది. అందరూ బలమైన అభ్యర్థులు కావడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. తణుకులో వైసిపి నుంచి మంత్రి కె నాగేశ్వరరావు, టిడిపి నుంచి ఎ రాధాకృష్ణ, కాంగ్రెస్‌ నుంచి కె రామారావు పోటీలో ఉన్నారు. వరుసగా రెండోసారి గెలవాలని వైసిపి అభ్యర్థి వ్యూహాలు రచిస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని టిడిపి అభ్యర్థి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌, వైసిపి నుంచి మంతి కొట్టు సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుంచి మార్నీడు శేఖర్‌ పోటీలో ఉన్నారు. రెండోసారి గెలుపుకోసం వైసిపి, గత ఎన్నికల్లో ఓటమి చెందిన జనసేన ఈసారి గెలుపు సాధించాలని ఆరాటపడుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపోటములపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు సాగుతున్న పరిస్థితి ఉంది.

➡️