‘కార్మికవర్గానికి ద్రోహమే!’

May 11,2024 00:09 #CITU, #Visakha

-మళ్లీ అధికారానికి వస్తే వైజాగ్‌ పోర్టునూ అమ్మేస్తుంది శ్రీ కోడ్‌ల పేరిట ట్రేడ్‌ యూనియన్‌ చట్టాలకు తూట్లు
– గత పదేళ్ల బిజెపి పాలనపై ‘ప్రజాశక్తి’తో సిహెచ్‌ నరసింగరావు
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :గడిచిన పదేళ్లలో దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం తప్ప కార్మికవర్గానికి, ప్రజలకూ మోడీ పాలనలో ఎలాంటి మంచీ జరగలేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్మికవర్గ అనుకూల విధానాల కోసం అనేక పోరాటాలు జరిగాయి. జరగబోయే 2024 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వంపై పోరాడే ‘కార్మిక, కర్షక శక్తులను కూడగట్టే ప్రత్యామ్నాయం దేశానికి అవసరం అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు అభిప్రాయపడ్డారు.
ప్రజాశక్తికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్య భాగాలు
కార్మికవర్గానికి గత బిజెపి పదేళ్ల పాలన ఎలా వుంది?
‘సర్వ సంపదలు సృష్టించేది శ్రామిక వర్గం. ఈ శ్రామిక వర్గానికి గత పదేళ్లలో బిజెపి తీవ్ర ద్రోహం చేసింది. దేశాన్ని పరిపాలించేందుకు అవకాశం ఇస్తే దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అదానీకి అప్పగించడానికి కుట్ర చేస్తూ ఉంది. గంగవరం పోర్టుతోపాటు కృష్ణపట్నం పోర్టులోనూ కార్మికులను బెదిరింపులకు పాల్పడుతోంది. బిజెపి మరలా అధికారంలోకి వస్తే గంగవరం పోర్టు మాదిరి విశాఖ పోర్టును కూడా కార్పొరేట్లకు కట్టబెడుతుంది. గంగవరంలో ఆదానీని అడ్డం పెట్టుకుని స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా నాశనం చేయాలని చూస్తోంది. విశాఖ ఉక్కుకు కొకింగ్‌ కోల్‌ రాకుండా గత నెల రోజుల నుంచీ అడ్డుపడి కొకింగ్‌ కోల్‌ డిపార్టుమెంట్‌ను నిర్వీర్యం చేస్తున్నది. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలనూ నాశనం చేస్తోంది. గతంలో హిందుస్థాన్‌ జింక్‌ను వేదాంతకు అమ్మి దాన్ని మూసివేయించింది.

కార్మికవర్గం ఈ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరిస్తుంది?
సిఐటియు కార్మికవర్గాన్ని రాజకీయంగా చైతన్యం చేయాలని కృషి చేస్తోంది. వర్గ పోరాటమే సిద్ధాంతంగా కార్పొరేట్లకు వ్యతిరేక ఉద్యమాలను నడిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక మైత్రిని కొనసాగించింది. రాష్ట్రంలో సమరశీల పోరాటాలను నిర్వహించింది. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, ఆశా, సమగ్రశిక్ష, మిమ్స్‌, రాజమండ్రి పేపర్‌ మిల్లు తదితర పోరాటాల్లో కీలకపాత్ర వహించింది.
కార్మిక హక్కుల అమలు తీరెలా వుంది?
బ్రిటీష్‌ కాలం నుండి కార్మికవర్గం పోరాడి తెచ్చుకున్న 29 చట్టాలను బిజెపి ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చింది. పాత చట్టాలకు విలువ లేకుండా చేసింది. కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తే రెండు రోజుల జీతం కట్‌ చేస్తున్నారు. నాయకులను జైళ్లలో పెడుతున్నారు. యూనియన్‌లను రద్దు చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా పోరాడకపోతే ఉన్న హక్కులన్నీ పోయినట్టే. పార్లమెంట్‌లో నాలుగు లేబర్‌ కోడ్‌లు, మూడు రైతు చట్టాలు, మోటార్‌ చట్టం, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ చట్టం, అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసింది. పార్లమెంట్‌లో 23 మంది వైసిపి, టిడిపి ఎంపిలు ఉన్నా సరే ఈ అన్ని చట్టాలకూ ఓటు వేసి ఆమోదించారు.
రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?
రాష్ట్రం విడిపోయిన ఈ పదేశ్లలో రెండు ప్రభుత్వాలు మారాయి కాని షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలను సవరించలేదు. గౌరవ వేతనం పేరిట అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీం వర్కర్లను ప్రభుత్వమే తీవ్రంగా దోపిడీ చేస్తోంది. వారి న్యాయమైన కోర్కెలను తీర్చాలంటూ ఆందోళనలు చేస్తే అటు చంద్రబాబు హయాంలోనూ, ఇటు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనూ నిర్బంధాలు, హౌస్‌ అరెస్టులు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను తు.చ. తప్పక అనుసరిస్తున్న రాష్ట్రంలోని వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట కార్మికుల్ని, ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులపాల్జేస్తోంది. యజమానుల పక్షానే ఉంటాం, పోరాటాలు చేసేటప్పుడు జీతాలు పెంచకూడదనే ప్రపంచ బ్యాంకు సిద్ధాంతాన్ని అమలు చేయడం, కార్మికులకు జీతాలు పెంచకుండా అడ్డుకోవడం, కొత్తగా సంఘాలు పెట్టకుండా అడ్డుకోవడం, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు రానివ్వకుండా చేయడం ఇందులో భాగం. యాజమాన్యాలు అన్ని చోట్లా ఈ విధానాలను అమలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో కార్మికవర్గ కర్తవ్యమేమిటి?
గంగవరం పోర్టులో యాజమాన్యం ఇప్పుడు ఆదానీ గానీ, గతంలో యజమాని రాజు గానీ బయట నాయకులను రానివ్వం అంటున్నారు. ఒకప్పుడు జాతీయ నాయకులందరూ ట్రేడ్‌ యూనియన్‌ల నుంచి వచ్చినవారే. అఖిల భారత స్థాయిలో పలు యూనియన్లకు నాయకత్వం వహించినవారే. సుభాస్‌ చంద్రబోస్‌ టాటా కంపెనీకి ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు. జ్యోతిబసు రైల్వే నాయకులు, వివిగిరి జ్యూట్‌ మిల్లు నాయకులు. ఇలా ట్రేడ్‌ యూనియన్‌ చట్ట ప్రకారం కార్మికులు కాని నాయకులు 50 శాతం వరకు ఉండవచ్చు. ఈ రోజు కార్పొరేట్‌ కంపెనీలు ఈ చట్టాలన్నిటినీ నిరాకరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలకు అండగా ఉండటం వల్ల కార్మికవర్గంనకు ఉన్న హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతోంది. దాన్ని ప్రతిఘటించాల్సిందే!
దేశంలో ఇప్పటికే బిజెపి ఓటమి స్పష్టమవుతోంది. మన రాష్ట్రంలో కూడా బిజెపిని, దానితో జతకట్టిన టిడిపి, జనసేను, కార్మికుల్ని, ఉద్యోగుల్ని తీవ్ర ఇక్కట్లపాల్జేసిన నిరంకుశ వైసిపిని ఓడించాలి. నిరంతరం కార్మికులు, ఉద్యోగులు, ఇతర కష్టజీవుల కోసం పనిచేస్తున్న సిపిఎం, వామపక్షాల అభ్యర్థులను గెలిపించాలి. లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఇండియా వేదిక పార్టీలకు ఓటు వేయాలి.

➡️