తెలంగాణలో హస్తానికే మెజార్టీ సీట్లు

May 7,2024 22:29 #Congress, #Voting

– కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ

– అగ్రనేతల సుడిగాలి ప్రచారం
గతేడాది తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక బిఆర్‌ఎస్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. కేంద్రంలో 400 సీట్ల లక్ష్య సాధన కోసం బిజెపి తెలంగాణాలో వీలైనన్ని సీట్లు తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాలను గెలవాలని ప్రయత్నిస్తోంది. భువనగిరి స్థానంలో పోటీ చేస్తున్న సిపిఎం మిగతాచోట్ల కాంగ్రెస్‌ను బలపరుస్తుండగా, సిపిఐ అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతునిస్తోంది. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. మే 13న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.
పీక్‌కు ప్రచారం..
తెలంగాణాలో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు హామీల్లో కొన్నింటిని అమలు చేశామని, మిగతావాటినీ అమలుపరుస్తామన్నది కాంగ్రెస్‌ ప్రధాన ప్రచారంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. కాగా, బిఆర్‌ఎస్‌, బిజెపిలు రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నాయి. మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖరరావు మొత్తం 17 నియోజకవర్గాలనూ కవర్‌ చేసేలా బస్సు చేస్తున్నారు. మరోవైపు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెెటిఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇమేజ్‌ తోపాటు ‘అబ్‌కీ బార్‌, 400 పార్‌’ నినాదంతో బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. మోడీ, అమిత్‌షా ఇప్పటికే అరడజనుకు పైగా జరిగిన సభల్లో పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కొత్త వివాదానికి తెరలేపి ఉద్రిక్తతలు, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు.
గత ఎన్నికల ఫలితాలు
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా 2019 ఎన్నికల్లో బిజెపి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బిజెపి విస్తరణకు పునాది ఏర్పడినట్లైంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలనే గెలుచుకుంది. హైదరాబాద్‌లో ఎంఐఎం తన సీటును నిలుపుకుంది.
జంపింగ్‌లకు టిక్కెట్లు
ప్రస్తుతం జరుగుతున్న ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు చెందిన అభ్యర్థుల జాబితాలను పరిశీలిస్తే.. ఇటీవల పార్టీలు మారిన పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, సీనియర్‌ నాయకులు ఇప్పుడు.. మునుపటి పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేయడం విశేషం. తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ఎక్కువ మంది ఎంపీలను పంపాలని భావిస్తున్న బిజెపి, తగ్గట్టుగానే రిజర్వేషన్ల విషయంలో బిజెపి నేతలు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్‌ సైతం ఎక్కువ సంఖ్యలో లోక్‌సభ స్థానాల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ప్రజాదరణ లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడివడంతో.. ఆ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే ఇది తాత్కాలికమేనని ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని విడిచి వెళ్లిన కీలక నేతల నుంచి బిఆర్‌ఎస్‌ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా కెసిఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయి జైలుకెళ్లడం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొందరు పోలీసులు, అధికారులు, బిఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. వర్షాభావం వలన రైతుల పంటలు దెబ్బతిన్నాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బిఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. రైతులకు రెండు లక్షల రుణ మాఫీని అమలు చేయడంలో విఫలమైందని బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. దీనికి కాంగ్రెస్‌ నేతలు ఆగస్టు 15 లోపు హామీలు నెరవేరుస్తామని కౌంటర్‌ ఇస్తున్నారు.

సీట్లు  17
మొత్తం ఓటర్లు  3.3 కోట్లు
పురుషులు  1.64 కోట్లు
మహిళలు  1.66 కోట్లు

ఎస్‌. భవాని

➡️