భువనగిరిలో జహంగీర్‌కు ప్రజాదరణ

May 10,2024 23:25 #Bhuvanagiri

-అన్ని వర్గాల నుంచి స్పందన

– ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేసిన సిపిఎం అభ్యర్ధి
-పార్టీ, ప్రజా పోరాటాలు, అభ్యర్థిపై విశ్వసనీయతే బలం

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో సిపిఎంకు అన్ని వర్గాల నుంచి ప్రజాదరణ లభిస్తోంది. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌, బిజెపి ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు స్వచ్ఛందంగా సిపిఎంను ఆదరిస్తున్నారు. స్థానిక ప్రజా నాయకునిగా పేరు తెచ్చుకున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్‌ ఇప్పటికే నియోజకవర్గమంతటా ప్రచారం పూర్తి చేశారు. సిపిఎం ముఖ్య నాయకులు, ప్రజా సంఘాలు జహంగీర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఎంపై విశ్వసనీయత, అభ్యర్ధిపై నమ్మకంతో స్థానిక సమస్యలను ప్రజలు చెప్పుకుంటున్నారు. వాటిపై అవగహన ఉన్న జహంగీర్‌ … సమస్యలకు పరిష్కారం, గత ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తున్నారు. భువనగిరిలో సిపిఎం సొంతంగా పోటీచేస్తూ తెలంగాణలోని మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఇండియా బ్లాక్‌ ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది.

అభివృద్ధి అట్టడుగున
నియోజకవర్గాల పునర్విభజన 2009 ఎన్నికల నుంచి ఉనికిలోకొచ్చిన భువనగిరిలో రెండుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి బిఆర్‌ఎస్‌ గెలిచాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించినా అభివృద్ధిలో అట్టడుగుస్థానంలోనే ఉంది. సంక్షేమం మరుగున పడిపోయింది. దీంతో నియోజకవర్గ ప్రజల్లో నిర్లిప్తత చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధుల వైఫల్యాలు ప్రస్తుత ఎన్నికల్లో ఎజెండా అవుతున్నాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జీ చెరుపల్లి సీతారాములు తదితరుల పర్యవేక్షణలో సిపిఎం ఎన్నికల ప్రచారం సాగుతున్నది. గత నెల రోజులుగా స్థానికంగా ఉండే సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, యువత జహంగీర్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. మండుటెండల్లోనూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థి జహంగీర్‌ లోక్‌సభ నియోజకవర్గమంతా చుట్టేశారు. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు, ఇబ్రహీంపట్నం తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు చేశారు. స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తున్నారు. పరిష్కారాలను చెబుతున్నారు. ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నారు. ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాతా తాము ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

సమస్యలై ప్రత్యర్థులకు సవాల్‌
ఎన్నికల్లో గెలవడానికి, డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ, అవకతవకలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజా సమస్యలను ఎజెండా చేస్తూ జహంగీర్‌ సవాల్‌ విసురుతున్నారు. భువనగిరి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నాయనీ, అయినా నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీలనూ నిలదీస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో ముఖాముఖీ చర్చకు సై అంటున్నారు. ఎన్నికల్లో సిపిఎంను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇంటింటికీ..

ప్రతిరోజూ ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జహంగీర్‌ వెళుతున్నారు. ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఆయా గ్రామాలు, పట్టణాలు, మున్సిపాల్టీ కూడళ్లతో ప్రజలతో కార్నర్‌ మీటింగ్‌లు పెడుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిని కలిసేందుకు సిపిఎం భారీ ప్రణాళిక రూపొందించింది. బృందాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారం కోసమే అని కాకుండా, నియోజకవర్గ వెనకబాటు, అక్కడ నెలకొన్న సమస్యలు, వృత్తులు, రైతులు, కార్మికులు, పరిశ్రమలు, వ్యవసాయ కార్మికులు, సామాజిక తరగతుల పరిస్థితులు, మహిళలు, విద్యార్థులు, యువత, సాగునీటి, తాగునీటి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు.

(బి రాజశేఖర్‌)

➡️