‘స్టార్‌’క్యాంపెయినర్ల రంగస్థలం

May 10,2024 00:25 #election

– వైసిపి, కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం
తెర తీసిన నటీనటులు
-సినీ ఆర్టిస్టుల ప్రచారానికి ఓట్లు రాలతాయా?
అసలే సార్వత్రిక ఎన్నికలు. ఓ పక్క అధికార వైసిపి, మరో పక్క తెలుగుదేశం,జనసేన, బిజెపి కూటమి పోటీపడుతున్నాయి. ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా సినీ గ్లామర్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. నటీనటులు ఎర్రటి ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటం ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో తారల సందడితో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పలువురు సినీ నటులు తమ సినిమాలను పక్కన పెట్టి మరీ తమ సన్నిహితుల తరపున పొలిటికల్‌ ప్రచారాలు చేస్తున్నారు. తమకు నచ్చిన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, అభ్యర్థులను గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.
హీరో చిరంజీవి నేరుగా రంగంలోకి దిగకున్నా జనసేనకు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి తన మద్దతు తెలిపారు. ఇటీవలే అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్‌, కైకలూరు అసెంబ్లీ బిజెపి అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌లను గెలిపించాలని కోరుతూ వీడియోలను రిలీజ్‌ విడుదల చేశారు. మరో సీనియర్‌ హీరో వెంకటేష్‌ తన వియ్యంకుడు, ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి తరపున ప్రచారం చేశారు. ఆయన కుమార్తె కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందారు. మూడోసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తన చిన్నల్లుడు భరత్‌ కోసం వైజాగ్‌లో ప్రచారం చేశారు. సినీనటుడు ఆలీ వైసిపి తరపున సామాజిక చైతన్యయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్నారు. కుప్పం పరిసర ప్రాంతాల్లో హీరో విశాల్‌ వైసిపి ప్రచారంలో పాల్గొన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పోసాని కృష్ణమురిళి, రాజారవీంద్ర, భానుచందర్‌ తదితరులు వైసిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. యాంకర్‌ శ్యామల కూడా పిఠాపురంలో వైసిపి అభ్యర్థి వంగా గీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
పిఠాపురంలోనే ఎక్కువమంది ప్రచారం
పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న పవన్‌ కల్యాణ్‌ కోసం వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. మెగా ప్యామిలీలోనే 12 మంది వరకూ సినీ ఇండిస్టీలో ఉన్నారు. జబర్దస్త్‌ స్టార్స్‌ అందరూ పిఠాపురంలో దిగి అక్కడే ఉంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, సుడిగాలి సుధీర్‌, ఆటో రామ్‌ ప్రసాద్‌ లాంటి వారంతా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. హీరో నిఖిల్‌ చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్యకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్‌ టిడిపి కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారంలోకి అడుగుపెట్టారు. ‘మన కోసం మన నారా రోహిత్‌’ అంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ’30 ఇయర్స్‌ ఇండిస్టీ’ ఫేం పథ్వీరాజ్‌ కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు మద్దతుగా భాజపా నాయకురాలు, సీనియర్‌ నటి ఖుష్బు సుందర్‌ ప్రచారం చేశారు. ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్‌ యాదవ్‌ను గెలిపించాలని బీజేపీ మద్దతుదారు, సినీ నటి నమిత ప్రచారం చేశారు.

➡️