డోన్‌ బరిలో ఉద్ధండులు !

Apr 27,2024 00:33 #election

సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఎన్నిక
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎవరి సొంతం అవుతుందోనని సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతోంది. వైసిపి, టిడిపి కూటమి, ఇండియా వేదిక నుంచి రాజకీయ ఉద్ధండులు పోటీ పడుతున్నారు…డోన్‌, బేతంచెర్ల మున్సిపాలిటీలు, ప్యాపిలితో కలిపి మూడు మండలాలున్న ఈ నియోజకవర్గంలో మొత్తం 2,24,111 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,10,457 మంది పురుష ఓటర్లు, 1,1,3,585 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 69 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.
ఇమేజ్‌ తోడవుతుందనే కోట్ల నమ్మకం
తొలుత టిడిపి అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఆనక.. కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో చంద్రబాబు జోక్యం చేసుకుని సుబ్బారెడ్డికి నచ్చచెప్పారు. కోట్ల 1991, 2004, 2009ల్లో మూడు సార్లు కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. కొద్దికాలం కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పని చేశారు. తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పరిచయాలు, డోన్‌ నుండే సూర్యప్రకాష్‌రెడ్డి సతీమణి సుజాత ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలవడం, వైసిపి ప్రతికూల విషయాలు తమకు విజయం చేకూరుస్తాయనే ధీమాను టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. .
ఇండియావేదిక, కాంగ్రెస్‌ మేనిఫెస్టో తోడవుతుందని కాంగ్రెస్‌ అభ్యర్థి
ఇండియా వేదిక తరపున పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి డోన్‌ మండలం మల్కాపురానికి చెందిన డాక్టర్‌ గార్ల మద్దిలేటి స్వామి కాంగ్రెస్‌ పార్టీలో పని చేస్తున్నారు. ప్రయివేటు కాలేజీ లెక్చరర్‌గా పని చేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా నిరంతరం పని చేస్తున్నారు. వామపక్ష అభిమానులు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. నాపరాయి, సున్నపు బట్టీలు, సిలికాన్‌ తదితర పరిశ్రమల్లో వామపక్ష కార్మిక సంఘాలు ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉంది. మద్దిలేటి స్వామికి ఇవి అనుకూలిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హాట్రిక్‌ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. వైసిపి హయాంలో అభివృద్ధి పనులు ఏమీ చేయకపోవడం తన విజయానికి దోహదపడుతుందని కోట్ల భావిస్తున్నారు. సిపిఎం, సిపిఐ, ఇతరుల సహకారం కాంగ్రెస్‌ పాంచ్‌న్యారు, గ్యారంటీలు గెలిపిస్తాయని ఇండియా బ్లాక్‌ అభ్యర్థి చెపుతున్నారు. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందోనని జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అభివృద్ధి పనులు గెలిపిస్తాయని బుగ్గన ధీమా
వైసిపి తరపున బుగ్గన, టిడిపి తరపున కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరపున గార్లపాటి మద్దిలేటి స్వామి బరిలో ఉన్నారు. బుగ్గన బేతంచెర్ల గ్రామ పంచాయతీకి వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. 2014, 2019 శాసనసభా ఎన్నికల్లో వైసిపి తరపున విజయం సాధించారు. పిఎసి ఛైర్మన్‌గా కొద్దికాలం పని చేశారు. బుగ్గన హయాంలో రూ.3వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని, దీనిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఆశీర్వదించాలని వైసిపి శ్రేణులు ప్రచారం సాగిస్తున్నాయి.

➡️