పార్లమెంట్‌ ఎన్నికలపై ఎందుకు మాట్లాడరు ?

  •  వైసిపి, టిడిపిలకు రామకృష్ణ సూటి ప్రశ్న

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం తప్ప పార్లమెంట్‌ ఎన్నికల విషయాలపై వైసిపి, టిడిపి కూటమి నాయకులు ఎందుకు మాట్లాడడంలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది పార్లమెంట్‌ ఎన్నికలు అనే విషయాన్ని విస్మరించి ప్రజలను మోసగించడం దుర్మార్గమని అన్నారు. విశాఖ అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశంపై టిడిపి, వైసిపి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మోడీ అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలను మూసేస్తారని, రాజ్యాంగం, లౌకికవాదం ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయన్నారు. రాష్ట్రంలో వైసిపికి, టిడిపి – జనసేన – బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఇండియా వేదిక భాగస్వాములైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తెలిపారు. ఇండియా వేదిక తరుపున విశాఖ జిల్లాలో పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి అత్తిలి విమల, పార్టీ రాష్ట్ర నాయకులు చలసాని రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

➡️