Dengue – అనంతలో డెంగ్యూ కలకలం – కేసు నమోదు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరవింద్‌ నగర్‌ లో శుక్రవారం డెంగ్యూ కేసు నమోదు అయింది. సీజనల్‌ వ్యాధుల నివారణకై ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను జరుపుతున్నారు. అలాగే డెంగ్యూ నిరోధక మాసోత్సవాలను జూలై 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్మూలనే దోమల నివారణకు మార్గం ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ సాధ్యం అంటూ అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన గేటుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. డెంగ్యూ నిరోధక మాసోత్సవాలు ప్రారంభం కాకమునుపే జూన్‌ నెలలోనే డెంగ్యూ కేసు నగరంలో నమోదు కావటం విశేషం.

ప్రత్యేకంగా దోమ కాటు వలన వచ్చే డెంగ్యూ మలేరియా, చికెన్‌గున్యా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను అరికట్టటానికి మలాథియాన్‌ డబ్ల్యుడిటి 25 శాతం మందును ప్రభుత్వ వసతి గృహాలలో స్ప్రేయింగ్‌ జరుపుతున్నారు. అయితే దోమలు వృద్ధి చెందకుండా నగరంలో మురుగు కాలువలను శుభ్రం చేయించడం ద్వారా దోమల లార్వాలను వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే నగరంలో ప్రధాన రోడ్లలో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్న అప్పటికప్పుడు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న అరవింద నగర్లో తొలి డెంగ్యూ కేసు నమోదైనట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

నగరంలో 74 సచివాలయాలలో 74 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాగే నగరంలోని ఆరు సర్కిళ్లకు అదనంగా పీహెచ్‌ మేస్త్రీలకు ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్లుగా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయా అన్ని ప్రశ్నిస్తే లేదన్న సమాధానమే ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నగరంలో దోమల స్వైర విహారం అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. విస్తఅతంగా స్ప్రేయింగ్‌ ఫాగింగ్‌ జరపటంతో పాటు ఎప్పటికప్పుడు మురుగునీటి ప్రవాహము అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయేలా పూడికతీత పనులు చేపట్టాలని నగర ప్రజలు కార్పొరేషన్‌ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆదిశగా చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు దీనికి తోడు ఉన్నతాధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపానికి తోడు బాధ్యతగా సక్రమంగా విధులు నిర్వహించే దిశగా ఆరోగ్య సిబ్బంది ప్రజారోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాల్సి ఉంది సానిటరీ ఇన్స్పెక్టర్లు పీహెచ్‌ మేస్త్రీలు క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహిస్తే కానీ నగరంలో పారిశుధ్యం మెరుగుపడే అవకాశాలు లేవు. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉంది. నగరంలో పర్యవేక్షణ లోపం కారణంగా పలు ప్రాంతాలలో సకాలంలో చెత్త తరలించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు. స్వయంగా కొంతమంది కార్పొరేటర్లు ఉన్నతాధికారులకు చెత్త తరలింపు మురుగు కాలువల శుభ్రం తదితర అంశాలపై ఫిర్యాదులు చేస్తున్న తక్షణ చర్యలు చేపట్టటం జరగటం లేదని వాపోతున్నారు. ఇటీవల నగరంలోని ప్రధాన వంకలైన నడిమి వంక , మరువ వంకలలో జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆకస్మిక తనిఖీలు రాత్రి 8 గంటల సమయంలో నిర్వహించి వంకలలో తక్షణం పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించిన తర్వాతనే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం ముందుకు కదిలింది. దీనితో వంకలలోని పూడిక తీతల ద్వారా వాటి నుంచి వెలువడే దుర్గంధాన్ని దోమల నివారణను కొంతమేరకు అరికట్టగలిగారు. అయితే నగరంలో వైరల్‌ ఫీవర్‌ ల కారణంగా ప్రజలు ఆసుపత్రుల చుట్టూ చికిత్సకై పరుగులు పెడుతున్నారు ప్రైవేట్‌ ఆస్పత్రులలో చికిత్స చేయించుకునే స్థోమత లేనివి పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అరవింద్‌ నగర్‌ లోని 45 ఏళ్ల మహిళకు డెంగ్యూ సోకటంతో అధికారులు పరుగులు పెట్టారు. సదరు మహిళా గఅహానికి వెళ్లి బయట నుంచి ఫోటోలు తీయించారు. ఆ మహిళ గఅహ పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ స్ప్రేయింగ్‌ జరిపి వచ్చారు డెంగ్యూ దోమ లార్వా 30 మీటర్ల పరిధికి మించి వ్యాప్తి చెందదని అందుకని మురుగునీరు నిల్వ లేకుండా చేపట్టడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దోమ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు సంబంధిత ఏఎన్‌ఎం ఆ ప్రాంతాన్ని పర్యటించి పరిశీలన జరుపుతుందని తెలిపారు. మురుగునీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయటం ద్వారా దోమ వృద్ధి చెందకుండా నివారించడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూ దోమ కాటు గురైన వారు రోగనిరోధక శక్తి బాగా ఉండేవారు యాక్టివ్‌గా ఉంటూ పనులు చేసుకోవడం జరుగుతుందన్నారు. అయితే బలహీనంగా ఉండేవారు కొంత అస్వస్థతకు గురికావడం జరుగుతుందన్నారు. డెంగ్యూ దోమకాటుకు గురైన వారు వైద్య పర్యవేక్షణలో చికిత్స పొంది తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచించారు.

➡️