‘మట్టి మనిషి’ విలువను చాటిన నాటకం

Apr 29,2024 05:16 #Matti Manas'

వాసిరెడ్డి సీతాదేవి గారి సుప్రసిద్ధ నవల మట్టి మనిషిని సీనియర్‌ కథా నాటక రచయిత వల్లూరి శివప్రసాద్‌ నాటకీకరించగా, గత బుధవారం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిభా ఎన్సెంబుల్‌ థియేటర్‌ వారు ప్రదర్శించారు. ఒక అర్ధ శతాబ్ది క్రితం ఒక వార పత్రికలో ధారావాహికగా వచ్చి, 2000లో పుస్తకంగా వచ్చి 14 భారతీయ భాషల్లోకి అనువాదం అయిన నవల ఇది. విశేష పాఠకాదరణ, పలు ముద్రణలు పొందిన నవల మట్టి మనిషి. తెలుగు నవలా చరిత్రలోనే ఒక విశిష్ట స్థానం గల నవల ఇది.
ఐదవ తరగతి వరకే చదువుకున్న సీతాదేవి హిందీలో సాహిత్యరత్న వరకు చదువుకొని బాలభవన్‌ డైరెక్టర్‌గా సెన్సార్‌ బోర్డు మెంబర్‌గా, ఐదుసార్లు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన ఉత్తమ రచయిత్రిగా పేరుప్రఖ్యాతులు పొందారు. తన ‘మరీచిక’ నవలను ప్రభుత్వం నిషేధిస్తే, కోర్టు ద్వారా ఆ నిషేధాన్ని ఎత్తి వేయించిన గొప్ప ధైర్యవంతురాలైన రచయిత్రి ఆమె.
ఇంతకుముందు ఏ మాధ్యమంలోనైనా ఈ నవలను దృశ్య కావ్యంగా చూపించడానికి ప్రయత్నించారో లేదో కానీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌, శివప్రసాద్‌, దర్శకురాలు నస్రిన్‌ ఇషాక్‌ ల పూనికతో ఇదిప్పుడు రంగస్థలం మీద మొదటిసారిగా ప్రదర్శించబడింది. గతంలో మైదానం, పాకుడు రాళ్లు నవలలను ఉర్దూ, హిందీ భాషల్లో రంగస్థల ప్రదర్శనలను కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ దర్శకురాలు మళ్లీ తనదైన శైలిలో ఈ నవలను సాకారం చేశారు.
ఒక బృహత్‌ నవలను వీలైనంత ఎక్కువగా రంగస్థలంపై చూపించాలని నాటక అనువాదకర్త, దర్శకురాలు భావించడంతో దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు అతి వేగంగా నాటకం నడుస్తుంది. రంగస్థలాన్ని ఒక ‘ఎలివేటెడ్‌ స్టేజ్‌’ (అది పొలం గట్టు లేదా నడకదారిగా భావించవచ్చు) దాని కింద ప్రధాన రంగస్థలం వేదికగా రంగాలంకరణతో సన్నివేశాలు జరుగుతాయి. పాత్రల దుస్తులు, మేకప్‌, లైటింగ్‌, సంగీతం చాలా మినిమల్‌గా ఉంచారు దర్శకురాలు.
మట్టికీ మనిషికీ, మరీ ముఖ్యంగా మట్టికీ – రైతుకీ ఉన్న అనుబంధం అందరికీ తెలిపిందే! ప్రపంచీకరణకు ముందు, ఆ సమయంలో, అటు తరువాత భూమితో మనిషి అవసరాలు ఎలాగ ఎంతగా పెరిగాయో ఎన్ని రకాలుగా నేల ఒక వినియోగ వాణిజ్య సాథనంగా రూపం మార్చుకుంటూ వస్తున్నదో మనకు తెలుసు.
అన్నం పెట్టే పంట భూమి నుంచి ఒక వినోద వ్యాపార అవసరంగా మార్పులు చెందుతూ సినీ మహళ్లుగా షాదీ ఖానాలుగా నగలు వస్త్ర సమస్త అవసరాలు తీర్చే వాణిజ్య ప్రపంచంగా అవి మారిపోయి జనజీవన విధానం, అభిరుచులు, అల్ట్రా మోడర్న్‌ పోకడలకు ఆకరమైన తీరును చూస్తూనే ఉన్నాం.
ఒక పల్లె రైతు కుటుంబంలో సామాన్య రైతు సాంబయ్య భూస్వామి కావాలనే కోరికతో మానవ సంబంధాల కంటే తన వ్యవసాయ భూమిని ఎకరాలు ఎకరాలుగా విస్తరింప చేసుకోవడంలో భార్యని, కొడుకును, బంధుత్వాలను పెద్దగా పట్టించుకోడు. ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంతో వియ్యమందుకోవడం తను సాధించిన ఘనకార్యంగా భావిస్తాడు, అదీ భూములు కొనుగోలులో తనకు సహకరించిన ఒక దళారి సహాయంతో. ఇక్కడ వరకు కథ ఇలా నడిస్తే … రెండవ ప్రధాన భాగం కొడుకు వెంకటపతి, కోడలు వరూధిని వైవాహిక జీవితంలో వచ్చే మార్పులు. చివరగా సర్వం కోల్పోయిన వెంకటపతి తండ్రికి, గ్రామస్తులకు మొహం చూపించలేక పట్నంలో చదువుకుంటున్న తన కొడుకును మళ్ళీ తండ్రి దగ్గరకే వ్యవసాయం చేసుకు బతకమని పంపడంతో ముగుస్తుంది, నాటకం.
అది ఒక మట్టి మనిషి జీవితంలో చోటు చేసుకున్న పెను విషాదం. ప్రేక్షకుడి కళ్ళను చెమ్మగిల చేసి హృదయాన్ని భారం చేస్తుంది. నిజానికి ఈ నవలకు మరింత న్యాయం జరగడానికి ప్రతి సీనుతో ప్రేక్షకుడు అనుసంధానం కావడానికి, నాటక నడక కొంత వేగం తగ్గించుకోవడానికి, వరూధిని ఆ కుటుంబంలో ప్రవేశించి అన్ని విధాలా ఆమె పతనమై మందుకు బానిసై ఈలోకం నుంచి నిర్గమించే వరకు రెండవ భాగంగా కొంత విరామం ఇచ్చిన తర్వాత నడిపిస్తే ఒక కన్యాశుల్కం, ఒక పడమటి గాలి వలె ఇప్పుడు ఈ మట్టి మనిషి చరిత్రగా నిలిచిపోతుంది.
ఒక గంట పాటు నాటకం లేదా ఒక నాటికనే ప్రేక్షకులు చూడటానికి కరువౌతున్న రోజుల్లో రెండున్నర గంటల నాటకం చూస్తారా? అన్న సందేహం అవసరం లేదు. సమగ్రమైన విలువలతో కూడిన ప్రయోగ ప్రదర్శనలను చిన్నబుచ్చి నిరాదరించిన సందర్భాలు లేవు. నిర్మాతలు సహకరిస్తే, నవలలో ఉన్న ప్రాణం పటుత్వం, విస్తృతి ప్రేక్షకుడు అనుభవిస్తే ప్రశంసిస్తాడు. ఒక సినిమా హాలు యజమానురాలు కావడంతో మొదలుపెట్టి ఆ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పైపైకి ఎదిగే క్రమంలో వరూధిని జీవితంలో నైతిక విలువలను వదిలేసి పతనం దిశగా ప్రయాణం మొదలై వంచనకు గురై సర్వం కోల్పోతుంది. తాగుడుకు పూర్తిగా బానిసై ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి పరాజితురాలిగా మత్యువుకు తనను తాను అర్పించుకుంటుంది.
చదువుకున్న భార్య చేతిలో కీలుబొమ్మై, భార్య అలవాటు చేసిన మందుకు బానిసై, వ్యక్తిత్వం అనే వెన్నెముక లేనివాడై, నిస్సహాయ నిర్వీర్యుడై, కొడుకును అతడి తాతకు అప్పగించి తన జీవితానికి తెరదించుకోవాలనుకుంటాడు వెంకటపతి. తాత మార్గదర్శకత్వంలో అనువంశికంగా వస్తున్న వ్యవసాయాన్ని ఆ మనుమడు తన లేత భుజాల పైకి తీసుకోవడంతో నాటకం ముగుస్తుంది.
ఇది మొదటి ప్రదర్శన కావడం, 35 మందికి పైబడిన నటీనటవర్గంతో, రిహార్సల్స్‌కు తగినంత సమయం దొరకకపోవడం వలన, అత్యధిక భాగం నటీనటులు పూర్తిగా ఔత్సాహికకులే కావడం వలన పూర్తిస్థాయి పరిపక్వ హావభావ నటనా విన్యాసానికి అఘాతం కలిగి ఉండవచ్చు. అందువల్ల ప్రేక్షకులు పూర్తిస్థాయి రసానందానుభూతిని పొందడంలో అవి అవాంతరాలుగా నిలిచాయి.
ఏమైనా ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ప్రయోగాలు కరువౌతున్న సమయంలో ఈ నాటకం ఒక అచ్చ తెనుగు రైతు కథను ఎలాంటి వక్రీకరణలు లేకుండా, రచయిత్రి సీతాదేవి రాసిన దానిని ఇన్నాళ్లకు రంగస్థల అనువాదం చేసి ఇప్పటి తరం ముందు అప్పటి జ్ఞాపకాలని తాజా చేసింది అని చెప్పుకోవచ్చు. ఇందుకు నిదర్శనం.. రసరంజని వారి నియమం ప్రకారమే ఈ టిక్కెట్టు నాటకాన్ని 500 మందికి పైగా ఉభయ రాష్ట్రాలోని అభిరుచి గల ప్రేక్షకులు తిలకించి, ఈ ప్రదర్శనను విజయ వంతం చేయడం. ఈ నాటకం అన్ని ముఖ్య నగరాల్లోనూ ప్రదర్శితం అవుతుందని ఆశిద్దాం.
– మల్లేశ్వరరావు ఆకుల
798187 2655

➡️