ట్రెండీగా .. ఏకోఫ్రెండ్లీగా …

May 14,2024 04:45 #Jeevana Stories

పెళ్లి అంటే రెండు మనసుల కలయిక. ఇద్దరు యుక్త వయస్కులు ఒకరితో ఒకరు కలసి జీవించటానికి ఒక ప్రారంభం. ఆ కార్యక్రమాన్ని ఏ పద్ధతిలో, ఎంతమందితో జరుపుకున్నా సారాంశం ఒక్కటే! అప్పటివరకూ విడివిడిగా పెరిగిన ఇద్దరు ఇకపై ఒకే ఇంట్లో ఒక్కటై కొనసాగటం. ఈ వేడుకను కొందరు లక్షలు, కోట్లు వెచ్చించి ఆడంబరంగా నిర్వహిస్తుంటేా ఇంకొందరు పర్యావరణ హితంగా ఆలోచించి, తక్కువ ఖర్చుతో జరుపుకుంటున్నారు. ఇటీవల వివాహాల్లో ఏకోఫ్రెండ్లీగా వచ్చిన మార్పుల్లో కొన్నిటిని పరికిద్దాం. రండి!
– మన చేతికి ఒక కాగితం వచ్చిందంటే దాని వెనుక ఒక పచ్చని చెట్టు బలిదానం ఉన్నట్టే లెక్క. అందుకనే కాగితం కోసం పచ్చదనాన్ని ఎందుకు హరించాలి? కమ్యూనికేషన్‌ టెక్నాలజీ అందుబాట్లోకి వచ్చిన కాలంలోా కార్డులే ఎందుకు ప్రింటేసి, పంచాలి? చక్కని వీడియోతోనో, ఆకర్షణీయమైన ఈాకార్డుతోనో ఆహ్వానం పలికితే సరిపోతుంది కదా! ఇలా ఆలోచించే చెన్నైకు చెందిన మురుగన్‌, కావేరి తమ వివాహ వేడుకకు ఈాకార్డులతోనే ఆహ్వానం పలికారు.
– ఉత్తరాదిలో పెళ్లికొడుకు కల్యాణ మండపానికి తరలిరావటమే పెద్ద హడావిడి. చెవులు దిమ్మెత్తిపోయే డిజె హంగామా. ట్రాఫిక్‌కి అంతరాయం. ఇంత శబ్ద కాలుష్యం సృష్టించటం అవసరమా? అని ఇటీవల ఢిల్లీలో ఆదిత్య అగర్వాల్‌ అనే పెళ్లికొడుకు ఎలక్ట్రిక్‌ బైకులో వివాహ వేదిక వద్దకు తరలివచ్చాడు.
– వివాహ వేదిక అలంకరణకు కొందరు చాలా ఖర్చు పెడతారు. అలంకరణకు వాడే వస్తువులు చాలావి కొన్ని గంటల సందడి తరువాత చెత్తలోకి చేరిపోతాయి. కాబట్టి, ఎందుకలా వృథా చేయాలి? వాడుతున్న వస్తువులను లేదా తిరిగి వాడటానికి ఉపయోగించే వస్తువులను అలంకరణలో వాడితే బాగుంటుంది కదా అనుకున్నారు కొల్‌కతాకు చెందిన పశిస్‌ జాగర్‌, దీపా కామత్‌. ఇద్దరూ ఇంటీరియల్‌ డిజైనర్లు. తమ పెళ్లిలో ఫ్లెక్లీలు వాడలేదు. నల్లబల్ల మీద చేతితోనే ‘మా వివాహ వేడుకకు ఆహ్వానం’ అంటూ రాశారు. అలంకరణకు రంగులు వేసిన కుండలు, అట్టపెట్టెలు, కొబ్బరి చెక్కులు వంటివి ఉపయోగించారు.
– ”స్థానికంగా దొరికే పూలనే అలంకరణకు ఉపయోగిస్తే వాటిని సాగు చేసే స్థానిక రైతులకు, కార్మికులకు కాస్త మేలు కదా” అని తలచి, ఆ విధంగానే చేశారు నిఫ్ట్‌లో చదువుకున్న సుదర్శన్‌, వీణ. స్థానికంగా దొరికే పూలు, అరటి ఆకులు, కొబ్బరి రేకులతో వేదికను అద్భుతంగా అలంకరించారు.
– వేడుకల్లో ప్లాస్టిక్‌, పాలిథీన్‌ వస్తువులు వాడడం మంచిది కాదని భావించారు బెంగళూరుకు చెందిన తల్లులు అనుపమా హరీశ్‌, చారులత. ఈ ఇద్దరు స్నేహితులూ తమ పిల్లల పెళ్లిళ్లలో అరటి ఆకులు, స్టీలు గ్లాసులు వంటివి ఉపయోగించారు.
– ఒక ముద్ద అన్నం తయారీ వెనుక అనేకమంది శ్రమ ఉంటుంది. బోలెడు ఖర్చు ఉంటుంది. అలాంటి తిండిని వృథా చేయటం ఎంత బాధ్యతారాహిత్యం! ఆహార పదార్థాల సంఖ్యను పెద్దగా పెంచి, గొప్పతనాన్ని చాటుకోవడం కన్నా అందరూ తినే పదార్థాలను రుచికరంగా వడ్డించటమే మేలు అంటున్నారు వీణ, విఘ్నేష్‌. తమ పెళ్లికి ఆ విధంగా ప్రణాళిక రూపొందించారు. వృథా జరక్కుండా చూశారు.
– అసలు ఇవి మాత్రం ఎందుకు? సింపుల్‌గా బంధుమిత్రుల మధ్య యువతీ యువకులు ఇద్దరూ దండలు మార్చుకొని, ఒక ప్రకటన చేస్తే పెళ్లి అయిపోయినట్టే! కేరళకు చెందిన అరుణ్‌, అవంతిక అలాగే చేశారు. ఆ తరువాత తమ వివాహాన్ని రిజస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పెద్దగా హడావిడీ లేదు, ఖర్చూ లేదు.
ఏకోఫ్రెండ్లీ ఆలోచనలు ఉన్న వధూవరులు ఇంకా ఏం చేస్తున్నారంటేా
– పెళ్లి వేదిక అలంకరణలో ఉపయోగించిన పూలు, అరటిబోదెలు, కొబ్బరిరేకులు వంటి వాటిని కంపోస్టు కేంద్రాలకు తరలించి, వాటిని సారవంతమైన ఎరువుగా మార్చటానికి సహకరిస్తున్నారు.
– వివాహ కానుకగా అతిథులకు ఖరీదైన ఇతరత్రా వస్తువుల బదులుా పూల, పండ్ల మొక్కలు; విత్తనాలు; గుడ్డ సంచులను అందజేస్తున్నారు.
– వివాహానికి హాజరైన పెద్దల చేత మొక్కలు నాటిస్తున్నారు. నటులు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాకీ బాగ్నాని తమ పెళ్లికి ఇలాగే చేశారు.
”ఈ భూమి మనది మాత్రమే కాదు; మన తరువాత వచ్చే తరతరాలది. ఈ భూమ్మీద ఉన్న అన్ని ప్రాణులదీ. అందుకే మనం బాధ్యతాయుతంగా ఉండాలి. మన సంతోషం కోసం ఈ భూమిని, ప్రకృతివనరులను ఉపయోగించుకోవొచ్చు. కానీ, దుర్వినియోగపర్చకూడదు. నాశనం అసలే చేయకూడదు.” అంటున్నారు ఈ ఏకోఫ్రెండ్లీ పెళ్లి కొడుకులూ పెళ్లికూతుళ్లూ.
వాళ్ల మాటల్లో, చేతల్లో కనిపిస్తున్న ఆదర్శాన్ని అభినందిద్దాం. అలాంటి కొత్త ఆలోచనల్లో మనమూ భాగస్వాములమవుదాం.

➡️