రేపటి కోసం గొంతెత్తిన అక్షరం

May 20,2024 06:02 #book review, #sahityam

తరగతి గది/ రాబోవు చరిత్రకు
ఇప్పటి బీజాక్షరం
తరగతి గది/ మానవమహా చైతన్య శిఖరం
తరగతిగది / ఆది మానవుని
జ్వలింపజేసిన అశౌర్య క్షేత్రం
విద్యావ్యవస్థ మీద ఇంత శాస్త్రీయమైన నమ్మకం ప్రకటించిన కవి బాల సుధాకర మౌళి. ఆయన పుట్టుకతో శ్రామికవర్గానికి, వృత్తితో అధ్యాపక వర్గానికి, భావజాలం రీత్యా ప్రగతిశీల వర్గానికి చెందిన కవి. ”తరగతి గది స్వప్నం” అనే దీర్ఘ కవిత ఈ వాస్తవాన్ని రుజువు చేస్తోంది. మౌళి జీతమాత్రోపజీవి అయ్యుంటే ఈ కావ్యం రాసేవారు కాదు. ఆయనకు వృత్తి పట్ల నిబద్ధత ఉంది. విద్య ప్రాముఖ్యం ఆయనకు తెలుసు. సంఘ సంస్కరణోద్యమం మొదట కొన్ని విద్యా భారతదేశ పునర్నిర్మాణంలో నిర్వహిస్తున్న క్రియాశీల పాత్ర ఆయనకు తెలుసు. మహాత్మా పూలే, బి.ఆర్‌ అంబేద్కర్‌ వంటి సాంఘిక విప్లవకారులు విద్యను సామాజిక పరివర్తనకు ఆయుధంగా చేసుకొని నడిపిన ఉద్యమాల జ్ఞానం ఆయనకుంది. ఉద్యమం, విద్య ఈ రెండూ ప్రపంచాన్ని మారుస్తాయన్నది ఆయన అవగాహన. ఆ రెంటికీ ‘తరగతి గది’ కేంద్రస్థానం.
సుధాకర మౌళి తన్మయత్వంతో తరగతి గదిని వర్ణించారు. ఆయన తరగతి గది పట్ల కలలు కనడంలో దిట్ట.
”తరగతి గదిలో/ అక్షరం పురుడు పోసుకుంటుంది
అక్షరాన్ని తరగతి గది/ అమ్మై సాకుతుంది.
నాన్నై నడక నేర్పిస్తుంది”
కవి దృష్టిలో తరగతి గది గంటలు లెక్క బెట్టే యాంత్రిక స్థలం కాదు. దేశ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాశక్తిని ఉత్పత్తి చేసే కార్మాగారం. తరగతి గది విద్యార్థులకు చైతన్యాన్ని కలిగించే స్థలం. మౌళి ఈ భావనను అనేక రూపాల్లో వ్యక్తం చేశారు.
”నేను కలల కార్మికుడిని ”
అధ్యాపకుడు దేనిని గురించి కలలు కంటాడు. తన పాఠశాల గురించి, తన విద్యార్థుల గురించి. తరగతి గదిని గురించి కలలు కనడమంటే దేశాన్ని గురించి కలలు కనడమే. దేశపు పునర్నిర్మాణం గురించి కలలు కనడమే! తరగతి గది, అధ్యాపకుల తర్వాత విద్యా వ్యవస్థకు కేంద్ర బిందువు విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థులు రెండు రకాలుగా ఉన్నారు. కొనగలిగిన శక్తి ఉండి ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలలో చదువు కొనేవారు. పేదరికం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు. మౌళి ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులుగా, పేద విద్యార్థులను గురించి మాట్లాడారు.
”ఉల్లికాడల కాళ్ళతో/ పగుళ్ళు దేలిన మడమలతో
జీవన విషాదంలోంచి/ బడికి వస్తున్న పిల్లలు” అంటూ శ్రామిక వర్గం నుంచి పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులను కవి ఆవేదనగా ఆనందంగా వర్ణించారు. ఆ వర్ణన ఆయన నిబద్ధతకు సంకేతం. అధ్యాపకుడు తన విద్యార్థులను ప్రేమించడం కన్నా మించిన కవిత్వం ఉండదు. బాల సుధాకర మౌళి విద్యార్థి ప్రేమైక జీవి.
అధ్యాపకులు వాచకాలను వాచకాలుగా బోధించి, పరీక్షలు రాయించి, మార్కులు తెప్పించే యాంత్రిక జీవి కారాదు. అంతకన్నా ఉన్నతమైన బాధ్యతను నిర్వహించాలి. తరగతి గదిని విద్యార్థుల వ్యక్తిత్వ వికాస కేంద్రంగా మార్చగల శిల్పి కావాలి. అసమ సమాజంలో అనేక రకాల విద్యార్థులు ఉంటారు. అనేక ఆర్థిక సాంఘిక వైరుధ్యాలలోంచి విద్యార్థులు వస్తారు. అధ్యాపకులు ఆ వైరుధ్యాల నుంచి విద్యార్థులకు బయటపడే శక్తినివ్వాలి. పేద పిల్లల పట్ల ప్రత్యేక మమకారం చూపాలి. వాచకాలతో పాటు, అనేక ఆర్థిక సాంఘిక రాజకీయాంశాలను సందర్భానుసారంగా బోధిస్తూ సామాజిక చైతన్యం కలిగించాలి.
”నేనూ, నా తరగతి గది
వెలివాడ పిల్లాడి ఆత్మ గౌరవ పతాకాన్ని” అని కవి తన నిబద్ధతను ప్రకటించుకున్నారు. వాచకాలతో పరిమితం కాకుండా వాచకేతర అంశాలను కూడా విద్యార్థులకు వాచకం ఆధారంగానే బోధించవచ్చు.
”జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం/ మరణాన్ని సైతం ముద్దాడే
వీరుల త్యాగం గురించి మాట్లాడతాను”
మైనారిటీలను గురించి, కాశ్మీరం గురించి … ఇంకా అనేకం గురించి మాట్లాడతానని కవి ప్రకటించి తరగతి గది ఎంత విశాలంగా ఉండాలో చెప్పారు.
ఇటీవలి కాలంలో విద్యార్థుల మీద అనేక రకాల వత్తిళ్లు పడుతున్నాయి. అనేక ఆంక్షలు విధింపబడుతున్నాయి. స్వేచ్ఛగా హాయిగా చదువుకోవల్సిన పిల్లలు బందీలుగా బతకాల్సి వస్తున్నది. కవి ఆ వాస్తవాన్ని రికార్డు చేశారు.
”స్వేచ్ఛగా ఎగరాల్సిన అక్షరం/ సంకెళ్ళ బరువుతో తూలిపోతుంది
అక్షరం జైలు శిక్ష అనుభవిస్తుంది”
”జైలుశిక్ష” అనే మాట అనేకార్థాలను ధ్వనిస్తున్నది. భారతీయ సామాజిక తత్వానికి విరుద్ధమైన ప్రపంచీకరణ భారతదేశాన్ని చుట్టుముట్టి విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది.
”మహా విషాదం
తరగతి గదిలోకి భూతం/ ప్రవేశించింది.
తెల్లని భూతం” అని కవి సంకేతాత్మకంగా చెప్పారు. ”తెల్లని భూతం” కూడా అనేకార్థక పదమేననిపిస్తుంది. ఇన్నాళ్లూ విద్యారంగం నుంచి నిషేధింపబడిన పేద పిల్లలు ఇప్పుడు అవకాశం రాగానే చదువుకోవడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. పేద పిల్లల విద్యాదాహాన్ని మౌళి ఆర్ధ్రంగా ఆవిష్కరించారు.
”అక్షరం కోసం/ ఆకలిని మర్చిపోతున్నారు.
అక్షరం కోసం/ కన్నీళ్లను తుడిచేసుకుంటున్నారు”
అంతటి దాహంతో వచ్చిన పిల్లలు పాఠశాలల్లో సహజంగా పొందాల్సిన స్వేచ్ఛను పొందలేకపోతున్నారని, కవి తన ఆవేదనను తెరలు తెరలుగా అల్లారు.
”కాలం తరగతి గదుల్లో కరిగిపోతోంది”
విద్యాసంస్థలు విద్యార్థుల్లో సహజంగా ఉండే సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి దోహదం చేయాలి. అదనంగా కొత్త సృజనాత్మకతను నేర్పాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులైపోయింది. విద్యాసంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు తమ సృజనాత్మకతనంతా కోల్పోయి యంత్రాలుగా మారిపోవాల్సి వస్తోంది. ఆ స్థితిలో అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. వర్తమాన విద్యావ్యవస్థ సారాన్ని కాచి, వడబోసి కవిత్వీకరించారు మౌళి.
”పిల్లలు రాత్రీపగలు/ యంత్రాల్లా పనిచేస్తున్నారు.
గాల్లో ఈలలు వేయలేని పిల్లలు
మట్టితో బొమ్మలు చేయలేని పిల్లలు
చదువుల జైళ్లలో బాల్యం బందీ అవుతున్న పిల్లలు
బాల్యంలోనే వృద్ధులవుతున్న పిల్లలు”
ఒత్తిడికి నిలబడలేని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం నిరంతరం చూస్తున్నాం. కవి దానిని ‘మృత్యువు వాసన’ అన్నారు. ఇంతటి అనారోగ్యకరమైన వ్యవస్థలో కూడా విద్యారంగ గుండెకాయలైన అధ్యాపకులు ఎంత సృజనాత్మకంగా, బాధ్యతాయుతంగా ఉండాలో మౌళి చెప్పారు. తొలి భాగంలోనూ, ఆఖరి భాగంలోనూ ‘అతడు’ అని చెబుతూ అధ్యాపకుడిని సూచించారు. ఎంతటి తలకిందుల వ్యవస్థలోనైనా అధ్యాపకులు విద్యార్థులను గొప్పవాళ్లుగా తీర్చిదిద్దవచ్చునన్న నమ్మకం కవికి ఉంది. ”అతడు నల్లబల్ల మీద/ రేపటి ఉషోదయాన్ని చూస్తున్నాడు” అంటూ మొదలైన కావ్యం- ”అతడు, అతని ముందు, అడుగులు వేస్తూ ఒక తరం” అని ముగుస్తుంది.
కవి ఒక ప్రణాళిక వేసుకుని ఈ కావ్యం రాశారు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా, తన చైతన్యం కొలది విద్యారంగాన్ని చైతన్యీకరించే సంకల్పం ఉండాలన్నది ఈ కావ్యం నేర్పిన పాఠం. విద్యను ప్రేమించే గురువు కవి అయితే కావ్యం ఎలా ఉంటుందో ‘తరగతి స్వప్నం’ కావ్యం అలా ఉంది. విద్యారంగం మీద చాలా కవితలు, కథలు, నవలలు, వచ్చాయి. ఈ కావ్యం ఇటీవలే వచ్చింది.
అన్ని సామాజిక రంగాలూ చెడిపోయినా, చెడిపోకుండా ఉండాల్సినది విద్యారంగం. అది కూడా చెడు మార్గం పట్టిందంటే ఇక రక్షించే వాళ్లుండరు. అలాంటి విద్యారంగంలోకి కూడా అనారోగ్యం ప్రవేశించిందే అన్న ఆవేదన కవికి ఉంది. ఆ ఆవేదన నుంచే ఈ కావ్యం పుట్టింది. ప్రపంచీకరణ ప్రవేశం తర్వాత కార్పొరేట్‌ విద్యాసంస్థల చేతుల్లోకి విద్యావ్యవస్థ వెళ్లిపోయి, విద్యార్థుల మేథస్సుతో వాళ్లు వ్యాపారం చేయడం ప్రారంభించారు. విద్యార్థుల సహజ శక్తులను ధ్వంసం చేసి కృత్రిమ తెలివిని, యాంత్రిక తెలివిని ఎక్కించి చంపుతున్న దుర్మార్గం మీద కవికి ఆగ్రహం ఉంది.
”వరుసలు వరుసలుగా.. అంగడి సరుకుల్లా పిల్లలు
పిల్లల కలలు అమ్మకానికి తూగే సరుకుల్లా
బాల్యం చితికిపోతున్న పిల్లలు”
ఇదీ కవి ఆవేదన. ఆగ్రహం.
”నేను తరగతి గదిలోంచి విస్ఫోటించే కవిని” అని ప్రకటించుకోవడంతో ఆ కవి ఆగ్రహం వినిపిస్తుంది.
‘చెమట కారుతున్న’ పిల్లల మాస్టారుగా సుధాకర మౌళి ఆధునిక తెలుగు కవిత్వంలో ఇదివరకే నలుగుతున్న విద్యావ్యవస్థను మరింత సృజనాత్మకంగా కవిత్వీకరించారు. ఆయన పదజాలం పాఠశాలలను కదిలిస్తుంది. మాటల కూర్పు పాఠశాలలను ఆకర్షిస్తుంది. మామూలు మాటలను, అందరికీ తెలిసిన మాటలను తన హృదయ నైపుణ్యంతో కవి పాఠకుల్ని కవిత్వంలో భాగస్వాముల్ని చేసుకుంటారు. ఒక భావాన్ని చెప్పడం కోసం అనేక పదాలు ఉపయోగించడం మనకు తిక్కన కాలం నుంచి ఉంది. ఆధునిక కాలంలో ముఖ్యంగా వచన కవుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. బాల సుధాకరమౌళిలో ఈ లక్షణం ఉంది. పునరుక్తి కోసం పునరుక్తి పనికిరాదు. కవి భావం పాఠశాలలో నాటుకోవడానికి అదొక సాధనంగా ఉపయోగపడినప్పుడే కవిత రాణిస్తుంది. మౌళి పద ప్రయోగం అర్థవంతంగా ఉంటుంది.
”అతడు వాక్యం విల్లులో నుంచి అక్షరాన్ని
బాణంలా వదులుతాడు
రాలిన ఆకులతో రగడ పుట్టిస్తాడు
కారు చీకటి నల్ల బల్లల మీద
రేపటి హృదయాన్ని దర్శిస్తున్నాడు”

– రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

➡️