విభజన హామీల ఊసేలేదు

May 9,2024 06:20 #PM Modi, #speech
  •  వైసిపిపై విమర్శలు, కాంగ్రెస్‌పై విసుర్లు
  •  కడప, విజయవాడ ప్రచారంలో ప్రధాని మోడీ

ప్రజాశక్తి- కడప ప్రతినిధి ,అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సైనిక్‌ స్కూల్‌ సమీపంలో ప్రజాగళం – వికసిన భారత్‌ – వికసిత ఆంధ్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ… రాష్ట్ర విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, విశాఖ రైల్వే జోన్‌ వంటి వాటి గురించి ప్రస్తావన చేయలేదు. పైగా, రాయలసీమ అభివృద్ధే నా కల, రాష్ట్రాభివృద్ధే నా ఆకాంక్ష అనడం విస్మయం కలిగించింది. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని తిరోగమనం వైపు మళ్లించాలని, చిన్నాభిన్నం చేయాలని చూస్తోందని మోడీ విమర్శించారు. అయోధ్య రామాలయాన్ని, 370 ఆర్టికల్‌ను సవాల్‌ చేస్తామంటున్నారంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రాయలసీమ నుంచి ఎనిమిది మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా ఈ ప్రాంతం వెనుకబడే ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని, అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. ఇసుక మాఫియా కారణంగానే అన్నమయ్య రిజర్వాయర్‌ కొట్టుకుపోయిందని ఆరోపించారు. సుమారు 30 గ్రామాలు నీట మునిగాయని, 12 మంది మృతి చెందారని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు రాబోతోందని, రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. మదనపల్లి ప్రాంతంలో టమాటా విస్తారంగా పడుతోందని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌డిఎ తరఫున పోటీ చేస్తున్న రాజంపేట, కడప ఎంపి అభ్యర్థులు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.

విజయవాడలో రోడ్‌ షో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే ప్రజలకు అనుమతి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో బుధవారం నిర్వహించిన రోడ్‌ షోలో ప్రచార వాహనంపై ప్రధాని మోడీకి ఒక వైపు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరొక వైపు జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ఎన్‌డిఎ నేతలకు టిడిపి, జనసేన ఎంపి అభ్యర్థులు కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్‌, బాలశౌరి, విజయవాడ తూర్పు టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌రావు, విజయవాడ పశ్చిమ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి, అడ్డూరి శ్రీరామ్‌, నెట్టెం రఘురామ్‌ స్వాగతం పలికారు. బందరు రోడ్డులోని పివిపి మాల్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు 1.5 కిలోమీటర్ల రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షో వాహనం ముందు మహిళా మోర్చా కార్యకర్తలు మోడీ చిత్రపటాలు పట్టుకుని నడిచారు. ట్రెండ్‌సెట్‌మాల్‌ వద్ద కోమటి జయరామ్‌, పాతూరి నాగభూషణం నేతృత్వంలో ఎన్‌ఆర్‌ఐలు మోడీకి స్వాగతం పలికారు.

ప్రతి వ్యక్తిని మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ
ప్రధాని పర్యటనలో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు నిర్మించి పోలీసులు పహారాకాశారు. బందరు రోడ్డులోకి చేరే ప్రతి పాయింట్‌ వద్ద పోలీసులు ప్రతి ఒక్కరినీ మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. బ్యాగులు, మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతించలేదు. ట్రాఫిక్‌ మళ్లింపుతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మోడీతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ 15 నిమిషాలు ఏకాంత భేటీ
రోడ్‌ షో ముగిసిన అనంతరం బెంజిసర్కిల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టెంట్‌లో మోడీతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ 15 నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి విజయావకాశాలు, అధికారుల వైఖరితో పాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతలు, సిఎస్‌, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరి వంటి అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పోలింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు మోడీ సూచించారు. రోడ్‌ షో విజయవంతమైందని మోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

➡️