బాబు..జగన్‌..పవన్‌..బిజెపి తొత్తులు..!

  • ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించండి
  • కోవూరు సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బిజెపి పార్టీకి తొత్తులని, ఆ పార్టీలకు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తరువాత చేసేందేమి లేదన్నారు. అమరావతిని భ్రమరావతి చేశారని, రాజధానిలో ఒక్క శాశ్వత బిల్డింగ్‌ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులన్నారనీ, ఒక్క రాజధాని కూడా ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పట్టుమని పది పరిశ్రమలు రాలేదని, పరిస్థితి ఇలాగే ఉంటే మన బిడ్డల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఇప్పటికే మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. ఒక్క ఏడాదైనా రైతుల కోసం నగదు ఖర్చు చేశారా అని నిలదీశారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. ఇలాంటి వ్యక్తులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు సాధిస్తారా? అని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే రైతులకు మద్దతు ధర కోసం రూ.మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయకుండా ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి జగన్‌ పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. వీళ్లకు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. బి అంటే బాబు, జె అంటే జగన్‌, పి అంటే పవన్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి కె.రాజును, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️