Tillu Square Movie Review : (డిజె టిల్లు) 2 మూవీ రివ్యూ

సిద్దు జొన్నలగొడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ కొట్టింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ సినిమా కొనసాగింపుగానే ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ సిద్ధూకి జోడీగా నటించారు. ఈ సినిమా మార్చి 29వ తేదీన శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా?!

కథ
రాధిక అనే అమ్మాయి చేతిలో మోసపోయిన డిజె టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని పెట్టుకుని వెడ్డింగ్‌ ఈవెంట్లు చేసుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, ఈవెంట్స్‌తో హ్యాపీగా సాగుతున్న టిల్లు లైఫ్‌లోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) ఎంటర్‌ అవుతుంది. ఓ పార్టీలో అనుకోకుండా టిల్లుకి లిల్లీ పరిచయమవుతుంది. కొద్దిసేపు పరిచయంతోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒక్క రాత్రిలోనే ఇద్దరూ ఒక్కటవుతారు. తెలారిలేచి చూసేసరికి లిల్లీ కనిపించదు. గదిలో లెటర్‌ మాత్రమే ఉంటుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత టిల్లుకి ఆసుపత్రిలో లిల్లీ కనిపిస్తుంది. తాను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాక్‌ అవుతాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు. ఇంతలో టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీని కలవడానికి వెళ్లిన టిల్లుకి లిల్లీ ప్లాన్‌ ఏంటో తెలుస్తుంది. కేవలం ఓ మిషన్‌ కోసమే లిల్లీ తనని వాడుకుంటుందని టిల్లుకి అర్థమవుతుంది. ఈ మిషన్‌కి మురళీశర్మకి, లిల్లీకి ఉన్న లింక్‌ ఏంటి? చివరికి ఆ మిషన్‌ లక్ష్యం ఏమిటి? లిల్లీ కోసం టిల్లు ఏం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
‘డిజె టిల్లు’ కొనసాగింపుగా వచ్చే మూవీ అంటేనే దీనిపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. డిజె టిల్లులోని రాధిక పాత్రని పరిచయం చేస్తూ ‘టిల్లు స్క్వేర్‌’ మూవీ కథ ప్రారంభమవుతుంది. ఆల్‌రెడీ డిజె టిల్లు సినిమా చూసిన వాళ్లకి ఈ మూవీ కొనసాగింపు అని తెలుస్తుంది. ఆ సినిమా చూడకపోయినా రాధిక ఎపిసోడ్‌ పరిచయంతో అంతకుముందు ఏం జరిగిందనేది ప్రేక్షకులకు కొంత అర్థమవుతుంది. ఇక టిల్లు ఈవెంట్‌ కంపెనీని నడుపుతూ హ్యాపీగా ఉంటాడు. సరిగ్గా ఈ సమయంలోనే టిల్లుకి ఓ పార్టీలో లిల్లీ పరిచయమవుతుంది. లిల్లీని చూడగానే టిల్లు మనసు పారేసుకుంటాడు. రూమ్‌లో ఇద్దరూ ఒక్కటవుతారు. తెల్లారిసరికి లిల్లీ మాయమవుతుంది. లిల్లీ కోసం పిచ్చివాడిగా తిరుగుతున్న సమయంలోనే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆసుపత్రిలో టిల్లుకి లిల్లీ కనిపిస్తుంది. తాను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాక్‌ అవుతాడు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి లిల్లీని ఇంటికి తీసుకెళతాడు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారు. ఈలోపే టిల్లు బర్త్‌డే వస్తుంది. టిల్లుని కలవడానికి లిల్లీ అపార్ట్‌మెంట్‌కి రమ్మంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌ కూడా రాధిక కలవమన్న అపార్ట్‌మెంట్‌నే. తీరా అక్కడికెళ్లిన తర్వాత లిల్లీ ఇచ్చిన ట్విస్ట్‌తో విరామం వస్తుంది. అయితే ఆ ట్విస్టు మాత్రం పెద్దగా థ్రిల్‌గా అనిపించదు. ఇక సెకండాఫ్‌లో మాఫియా ఎంట్రీతో సోసోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కామెడీ తగ్గింది. అయితే ప్ల్రిక్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో సిద్దు నటనతో ఆకట్టుకుంటాడు. క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. ఓవరాల్‌గా ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన రచన, నటనతో మ్యానరిజంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. తెలిసిన కథే అయినా ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా దర్శకుడు మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించడంలో విజయం సాధించాడు. ఈ సినిమాకు నిడివి తక్కువ ఉండడం ప్లస్‌ పాయింట్‌. ఓసారి థియేటర్‌కి వెళ్లి సినిమాను చూసి రావొచ్చు.

ఎవరెలా చేశారంటే..
టిల్లూ పాత్రలో సిద్ధు ఒదిగిపోయాడు. కరెక్టు టైమింగ్‌లో పంచ్‌లు పేల్చుతూ తెరపై నవ్వులు పూయించాడు. తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ నటన, కామెడీ బాగా వర్కవుట్‌ అయింది. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ నటన బాగుంది. మురళీశర్మతోపాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. భీమ్స్‌ సిసిరోలియో నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలోని రెండు పాటలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️