రాజ్‌కోట్‌ ప్రమాదంపై అంతులేని నిర్లక్ష్యం

May 26,2024 23:15 #death, #fire acident, #rajkot
  • మృతుల సంఖ్య కూడా వెల్లడించని యంత్రాంగం
  • బిజెపి ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం
  • 33కు చేరిన మృతుల సంఖ్య
  • సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

రాజ్‌కోట్‌ : గుజరాత్‌లో రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బిజెపి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని, సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరిగిందని బాధితుల బంధువులు వాపోతున్నారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని కానీ, ఎంత మంది గాయపడ్డారన్న వివరాలను కానీ ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా వెల్లడించపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక మీడియా మాత్రమే బాధితుల వివరాలను వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదంలో 33 మంది సజీవ దహనమయ్యారని, మరో 15 మంది ఆచూకీ తెలియరాలేదని స్థానిక మీడియా పేర్కొంది. కాగా ఘటనా స్థలాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆదివారం పరిశీలించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

దోషులను కఠినంగా శిక్షించాలి..
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఎవ్వరినీ ఉపేక్షించరాదని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక చిన్నారి తండ్రి ప్రదీప్‌ సిన్హా చౌహాన్‌ డిమాండ్‌ చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలని, ఎవ్వరికీ బెయిల్‌ మంజూరు చేయరాదని, ఒక వేళ బెయిల్‌ ఇస్తే తానే ఆ దుండగులను చంపేస్తానని ఆయన అక్రోషంతో అన్నారు. ఈ ప్రమాదంలో ప్రదీప్‌ తనయుడుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మున్సిపల్‌ యంత్రాంగం ఏం చేస్తోంది..
ప్రయివేటు సంస్థ నిర్వహిస్తున్న ఈ క్రీడా ప్రాంగణం నాలుగేళ్ల కిందట నుంచి పని చేస్తోంది. అయితే ఇక్కడ అగ్ని ప్రమాదాల నివారణలకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా? లేదా అనే విషయాన్ని స్థానిక అధికారులు ఎవ్వరూ నిర్ధారించడం లేదు. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన ఇతర ఏజెన్సీల మాటేమిటి? అని రాజ్‌కోట్‌కు చెందిన మరో నివాసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమంటే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్‌ఒసికి కూడా దరఖాస్తు చేయలేదు : ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు
ఈ ప్రమాదానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. టిఆర్‌పి గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకి, మేనేజర్‌ నితిన్‌ జైన్‌ను అరెస్టు చేశారు. ఆరుగురిపై ఐపిసి సెక్షన్లు 304, 308, 336, 338, 114 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అరెస్టు చేశామని, ఇతరుల కోసం క్రైమ్‌ బ్రాంచ్‌ అన్వేషిస్తోందని రాజ్‌కోట్‌ పోలీసు కమిషనర్‌ రాజు భార్గవ తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న గేమింగ్‌ జోన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు నిర్వాహకులు ఫైర్‌ సేఫ్టీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, కనీసం ఎన్‌ఒసికి కూడా దరఖాస్తు చేయలేదని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 2000 చదరపు మీటర్ల ప్లాటులో నిర్మించిన మూడు అంతస్తుల భవనానికి కానీ, అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక టిన్‌ రూఫ్‌ నిర్మాణాలకు కానీ ఎటువంటి ఫైర్‌ సేప్టీ ఏర్పాట్లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందో ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు తెలియజేస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీనియర్‌ పోలీస్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.

మానవ తప్పిద విపత్తు : హైకోర్టు
ఈ ఘోర ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిన విపత్తు అని గుజరాత్‌ హైకోర్టు ఆదివారం ఉదయం పేర్కొంది. ఈ ప్రమాద ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 27న దీనిపై జస్టిస్‌ బీరెన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవన్‌ దేశాయితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇలాంటి అమ్యూజ్‌మెంట్‌, గేమింగ్‌ జోన్‌ సంస్థలు తప్పనిసరి ఫైర్‌ సేప్టీ, ఫుడ్‌ సేప్టీ వంటి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లుకు చెందిన న్యాయవాదులు అందరూ తమ ముందు సోమవారం విచారణకు హాజరు కావాలని, ఇలాంటి సంస్థల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

➡️