అందరయ్య… మన సుందరయ్య

ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై.. ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. ఆరు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖులు. బాల్యంలో అభ్యుదయ భావాలతో చివరి ఊపిరి వరకూ ఆదర్శంగా నిలిచిన నేత. ఈ నెల 19న సుందరయ్య వర్థంతి సందర్భంగా ఆ మహోన్నతుని గురించి కొన్ని విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..

నెల్లూరు జిల్లా కోవూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1న పుచ్చపల్లి సుందరయ్య జన్మించారు. పూర్తి పేరు వెంకట సుందర రామిరెడ్డి. కులవ్యవస్థను నిరసిస్తూ ఆయన పేరు చివరన ఉన్న రెడ్డి తొలగించుకుని, పుచ్చలపల్లి సుందరయ్యగా పేరు మార్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులు పుచ్చలపల్లి వెంకట్రామిరెడ్డి, శేషమ్మ. వీరికి సుందరయ్య ఆరవ సంతానం. ఆయనకు ఒక అన్న, నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. బడికి వెళ్లడం మొదలుపెట్టాక ఇంటా, బయటా క్రమశిక్షణతో నడుచుకునేవారు. ఆ రోజుల్లో ప్రాథమిక స్థాయిలో ‘పెద్ద బాలశిక్ష’ పై గొప్ప పట్టు సంపాదించారు. పాఠాల్లో అందరికన్నా ముందుండేవారు. తొలి రోజుల నాటి విద్య తర్వాత కవిత్వం, సాహిత్యంలోని అనేక విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. పిల్లవాడుగా వుండగానే సుందరయ్య సామాజిక అసమానతలను, పీడనకు వ్యతిరేకంగా స్పందించడం మొదలుపెట్టారు. గ్రామంలో కుల వివక్ష ఆయనకు చాలా కష్టం కలిగించేది. దానిపై ఇంటాబయటా కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్దలతో వాదన వేసుకునేవారు.16 ఏళ్లు వున్న తన అక్కయ్యను 42 ఏళ్లవాడైన వీరాస్వామిరెడ్డి అనే మేజిస్ట్రేట్‌కు ఇచ్చి, వివాహం చేయాలని కుటుంబసభ్యులు అనుకున్నప్పుడు ఆయన వ్యతిరేకించారు.
ఊరిలో వ్యవసాయ పనులు, ఇతర వృత్తి వర్గాలకు చెందిన వారి కష్టాన్ని చూస్తూ పెరిగారు. ‘అప్పట్లో రైతులు రసాయనాలు, ఎరువులు వాడేవారు కాదు. సహజ ఎరువుల వాడకం ఎక్కువగా వుండేది. దిగుబడి కూడా దానికి తగ్గట్టు ఉండేది.’ అని సుందరయ్య తన ఆత్మకథలో రాశారు. శ్రమ దోపిడీకి గురవుతున్న పాలేర్లు, శ్రమ జీవులు, కూలీల పక్షాన నిలబడ్డారు. ‘1928-30 మధ్య కాలంలో గ్రామాల్లో వ్యవసాయం, ఇతర సంబంధిత కార్యక్రమాలు చేపట్టిన దశలో వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్లను ఆలోచించడానికి, రూపొందించడానికి తోడ్పడ్డాయి.’ అని చెప్పారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తల్లి తీసుకున్నారు. ఆరేళ్ల వయసులో తన పెద్దక్క పెళ్లి జరిగింది. ఆమె సుందరయ్యని, రామచంద్రారెడ్డిని తిరువళ్లూరు తీసుకెళ్లి చదివించారు. మూడు, నాలుగైదు తరగతులు తిరువళ్లూరులో చదివిన సుందరయ్య ఆ తర్వాత ఏలూరు, రాజమండ్రి, చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.


17 ఏళ్ల వయసులోనే అరెస్ట్‌
విద్యార్థి దశ నుంచే ఆదర్శ భావాలు, త్యాగనిరతి పుణికి పుచ్చుకున్న సుందరయ్య 1930 ఏప్రిల్‌లో మహాత్మాగాంధీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి, స్వాతంత్య్రోద్యమంలో చేరి 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్‌ అయ్యారు. మైనారిటీ తీరకపోవడంతో ఆయన్ను రాజమండ్రిలోని బోస్టల్‌ స్కూల్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వస్తూనే వ్యవసాయ కార్మికులను ఏకం చేసి, భూస్వాములపై తిరుగుబాటు చేశారు. సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే పనిని తన భుజానికెత్తుకున్నారు. 1943లో బొంబాయిలో జరిగిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సుందరయ్య మరణించే వరకూ ఉమ్మడి పార్టీలోనూ, ఆ తర్వాత ఏర్పడిన సీపీఐ (ఎం)లో వివిధ హోదాలలో పనిచేశారు. 1939-42 మధ్య అజ్ఞాత వాసానికి వెళ్లిన సమయంలో సుందరయ్య కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1943లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించి, కలకత్తా థీసిస్‌ ఆధారంగా సాయుధ పోరాటాన్ని ప్రభోదించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. 1948-52 మధ్య కాలంలో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు.


పిల్లలు వద్దునుకుని..
దేశవ్యాప్తంగా 1942లో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేసినా తెలంగాణాలో మాత్రం పార్టీపై నిర్బంధం నడుస్తూనే ఉంది. దాంతో పార్టీ రహస్య సంస్థగానే ఉండేది. రహస్య జీవితంలోని కామ్రేడ్స్‌తో సంబంధాలు పెట్టుకోవడం కోసం తాను దిల్‌సాద్‌ చారి, ఎ.ఎస్‌.ఆర్‌.చారి ఇళ్లకు వెళ్లేవారు. ఎ.ఎస్‌.ఆర్‌.చారి జైలులో ఉన్నప్పుడు, వారి కుటుంబ సభ్యులతో పాటు లీలమ్మ, ఆమె తల్లి ఉండేవారు. ఆమె తల్లి రహస్య కేంద్రంలో పార్టీ కామ్రేడ్స్‌కు వంట చేసిపెడుతూ సహకరించేవారు. ఆమె ద్వారానే లీలమ్మ పార్టీ వైపు ఆకర్షితురాలై, అంకితభావంతో పనిచేసేవారు. ఆమెది మహారాష్ట్ర. అప్పటికి ఆమె డిగ్రీ పూర్తి చేసి, సెంట్రల్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన బ్యాంకు పనికి ముందు, తర్వాత శని, ఆదివారాల్లో, తీరిక సమయాల్లో పార్టీ కేంద్రంలో వివిధ రకాల పనులు చేస్తుండేవారు. సుందరయ్యకు 1943, ఫిబ్రవరి 27న లీలమ్మతో వివాహం జరిగింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించిన బృహత్తర బాధ్యతలు వారి భుజాలపై ఉన్నాయని గ్రహించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, లీలమ్మ అంగీకారంతోనే సంతానం వద్దని నిర్ణయించుకున్నారు. పిల్లలు పుట్టకుండా సుందరయ్య వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నారు.


తెలంగాణా సాయుధ పోరాటంలో..
ఆంధ్ర అంతటా రైతాంగ పోరాటాల పరంపర చోటుచేసుకుంటున్న కాలంలో సుందరయ్య రైతులతో పాటు ఉన్నారు. సాయుధ గెరిల్లాలకు శిక్షణ ఇచ్చారు. పార్టీపై నిషేధం ఉన్న సమయంలోనూ తోటి కామ్రేడ్స్‌తో రహస్యంగా చర్చించడం, బాధిత కుటుంబసభ్యులను కలుసుకునేవారు. 1947-48 మధ్యకాలంలో నిజాం సైన్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ శక్తివంతమైన కార్యక్రమం సాగించింది. శత్రువులకు ఏమాత్రం అంతుపట్టనివ్వకుండా వ్యూహాత్మక వైఖరి అనుసరించేలా సుందరయ్య ప్రణాళిక వేశారు. దళాల ద్వారా ఊరురా తిరిగి నాటకాలు, పాటలు ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. అప్పటికీ సాయుధ పోరాటం దాదాపు మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా గ్రామాల నుంచి విశాలమైన ప్రజా మద్దతు కమ్యూనిస్టు పార్టీకి లభించింది. దాంతో గ్రామాల్లోంచి భూస్వాములు తరిమెయ్యబడ్డారు. నాలుగు వేల గ్రామాల్లో 10 లక్షల ఎకరాలకు పైగా భూమి పంపిణీ జరిగింది.
తెలంగాణ పోరాట విరమణ, తొలి సాధారణ ఎన్నికలు, ఆ తరువాతి పరిణామాలు.. పార్టీ చీలిక.. ఇలా 1964లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శిగా సుందరయ్య ఎన్నికయ్యారు. 1976 వరకూ ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కేంద్ర కమిటీలో కొనసాగి, సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలో ఏ బాధ్యతల్లో వున్నా నిబద్ధత సుందరయ్య ప్రత్యేకత!

చట్టసభలో
సుందరయ్య 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా సుందరయ్య వ్యవహరించారు. ఆనాడు ఆంధ్రా నుంచి 17 మంది కమ్యూనిస్టులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సంబంధిత అంశంపై చదవకుండా, పూర్వపరాలు, ప్రభావం, పర్యవసానాలు అధ్యయనం చేయకుండా సుందరయ్య సభకు వచ్చేవారు కాదని ప్రతీతి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మేధావులు, నిపుణులతో పాఠాలు చెప్పించేవారు. అంకెలు, సంఖ్యలతో సభకు వెళ్లమని చెప్పేవారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన అతి సామాన్య వ్యక్తిగా సుందరయ్య నిలిచిపోయారు.
ఆయన అనేక ప్రామాణిక గ్రంథాలు రచించారు. ”విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గ్రామీణ పేదలు-భూ పంపకం, తెలంగాణ సాయుధ పోరాటం-కొన్ని గుణపాఠాలు, ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర నీటి పథకాలు, భారతదేశంలో విప్లవ సాధనపట్ల మార్క్సిస్టు పార్టీ అవగాహన, భూ సమస్యపై అవగాహన, గంగా కావేరి కాలువ, తదితర సమస్యలు, ప్రజా రంగాలు- సంఘాలు రాజకీయ, సాంస్కృతిక వ్యాసాలు,’ చట్టసభల్లో ప్రసంగాలు” వంటి పుస్తకాలు రాశారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు, సలహాలు, వాదనలు ఇప్పటికీ విలువైనవే. 1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి సుందరయ్య కన్నుమూశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో, గచ్చిబౌలిలో ఆయన పేరుతో విజ్ఞానకేంద్రం, గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు నిర్మించారు. ఆయన ప్రజల కోసం అహరహం శ్రమించారు. పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన మచ్చలేని మహామనీషిగా ఎప్పటికీ ప్రజలు గుండెల్లో ఉండిపోయారు. ఆకలి, దారిద్య్రం లేని సమసమాజం కోసం పోరాడిన విప్లవకారుడు. బడుగు, బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతి మన సుందరయ్య.

➡️