ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ముకుమ్మడి సెలవులు..!

May 8,2024 23:13 #Business

86 విమానాల రద్దు
ప్రయాణికుల ఆందోళన
డిజిసిఎ నోటీసులు
న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగులు ముకుమ్మడి సెలవులు పెట్టారు. దీంతో బుధవారం నాటికి 86 ఎయిరిండియా విమానాలు రద్దు అయ్యాయి. సంస్థలో పని చేస్తున్న సుమారు 300 మంది క్రూ సిబ్బంది అనారోగ్యం పేరిట మూకుమ్మడి సెలవు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. అటత్తుగా విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్‌ ఏసియా ఇండియా విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సిబ్బందిలో నిరసన, అసంతృప్తి వ్యక్తం అవుతుంది. విలీన ప్రక్రియలో ఉద్యోగుల వేతన భత్యాల ప్యాకేజీ, అనుభవం, ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఉద్యోగ భద్రత కొరవడిందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎఐఎక్స్‌ఇయు) రెండు పేజీల బహిరంగ లేఖ రాసింది. ఉద్యోగ భద్రత, వేతనం, మెయింటెనెన్స్‌, సీనియారిటీ పట్ల గౌరవం ప్రదర్శించడం లేదని తెలిపింది. కంపెనీ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ.. తమకు హెచ్‌ఆర్‌ఎ వంటి అలవెన్సులు తొలగించడం అన్యాయమని ఉద్యోగులు అందులో ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ వేతనాలకు కోత పడుతోందని ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. మరోవైపు అంతర్గత ఉద్యోగ పోస్టింగ్‌ల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉన్నప్పటికీ ఇతరులను నియమించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
టాటా గ్రూపులోని విమానయాన కంపెనీల్లో పైలట్లకు గతంలో 70 ఫ్లయింగ్‌ అవర్స్‌కుగానూ గ్యారెంటీ పే ఉండగా.. దాన్ని 40 గంటలకు తగ్గించింది. ఈ విధానంతో తమ వేతన ప్యాకేజీలో కోత పడుతుందని టాటాకు చెందిన విస్తారాలో తొలుత ఆందోళన మొదలయ్యింది. ఆ సంస్థలోనూ ఉద్యోగులు గత నెల మూకుమ్మడి సెలవులు పెట్టి.. యాజమాన్యాన్ని దిగివచ్చేలా చేశారు. నిరసన తెలుపుతున్న క్యాబిన్‌ క్రూ సిబ్బందిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. తమ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వారు బుక్‌ చేసుకున్న టికెట్లకు పూర్తిగా రీఫండ్‌ చేస్తామని, వారం లోపు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చే కొన్ని రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిఇఒ అలోక్‌ సింగ్‌ తెలిపారు. కాగా.. విమాన సర్వీసుల రద్దుకు కారణాలు తెలుపాలంటూ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యానికి డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) నోటీసులు జారీ చేసింది.

➡️