భూదాన్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించొద్దు

May 20,2024 01:25 #lands
  •  నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కొరడా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూదాన్‌ భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులెవరికీ భూ యాజమాన్య హక్కులు కల్పించొద్దని ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. ఒకట్రెండు చోట్ల కొందరికి లబ్ధి చేకూర్చేందుకు లోపాయికారిగా భూ యాజమాన్య హక్కులు కల్పిస్తే అవి చెల్లవని స్పష్టం చేస్తోంది. నిబంధనలను అతిక్రమించి భూ యాజమాన్య హక్కులు కల్పించిన తహశీల్దారు, ఆర్‌డిఒలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి తాజాగా ఈ నెల 16న సిసిఎల్‌ఎ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్ధేశం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపి అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ నెంబరు 35/2023 ప్రొవిజన్స్‌ నాట్‌ అప్లికేబుల్‌ టూ భూదాన్‌ ల్యాండ్స్‌ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రభుత్వం, రెవెన్యూశాఖలు హైకోర్టు నుంచి స్పష్టత తీసుకున్నట్లు కూడా అందులో తెలిపారు. భూములకు ధరలు రావడంతో చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఆయా భూములు దక్కించుకునేందుకు అనేకమంది పావులు కదుపుతున్నారు. భూదాన్‌ బోర్డు రద్దయిన కాలంలో జారీచేసినట్లు నకిలీ సంతకాలతో కూడిన పత్రాలతో ఆయా భూములు దక్కించుకునేందుకు ప్రొసీడింగ్స్‌తో దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య బాగానే ఉన్నట్లు రెవెన్యూశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్‌ యజ్ఞబోర్డుకు సంబంధించిన భూములు సుమారు 30 వేల ఎకరాలున్నట్లు గుర్తించింది.

➡️