అడుగంటిన బొగ్గు నిల్వలు

May 20,2024 08:07 #boggu, #ntps
  •  రెండు రోజులకు కూడా సరిపోని పరిస్థితి
  •  అధిక ధరకు ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల పరిస్థితి దినదినగండంగా మారింది. ప్లాంట్లకు ఒక్కరోజు బొగ్గు ఆగినా అక్కడ విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. ఎపిజెన్‌కో ఆధ్వర్యంలో మూడు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో ఒక్క దానిలో కూడా రెండు రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు కూడా లేని పరిస్థితి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ ప్లాంట్‌లో ఒక్కరోజుకు కూడా సరిపడ నిల్వలు లేవు. బొగ్గు అందుబాటులో లేకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది. దామోదరం సంజీవయ్య ప్లాంట్‌ నడవాలంటే రోజుకు సరాసరి 29 వేల మెట్రిక్‌ టన్నుల (ఎంటి) బొగ్గు అవసరంగా కాగా, ప్రస్తుతం అక్కడ 25,003 ఎంటిలు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రోజుకు 22,458 ఎంటిల బొగ్గుతోనే ప్లాంట్‌ను నడుపుతున్నారు. విజయవాడ ప్లాంట్‌ రోజువారీ నడిచేందుకు 41,500 ఎంటిల బొగ్గు అవసరం. ఇక్కడ 53,487 ఎంటిలు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో 29,689 ఎంటిలతో నడుపుతున్నారు. రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌ రోజువారీ నడిచేందుకు 21 వేల ఎంటిల బొగ్గు అవసరం. ఇక్కడ 30,309 ఎంటిలు మాత్రమే అందుబాటులో ఉండటంతో 20,897 ఎంటిల బొగ్గుతోనే ప్లాంట్‌ను నడుపుతున్నారు.
రాష్ట్రంలో వాతావరణం మార్పులతో విద్యుత్‌ వినియోగం తగ్గింది. అయినా ప్రైవేట్‌ నుంచి అధిక ధరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్‌కు సరాసరి రూ.8.237 పెట్టి సంస్థలు కొంటున్నాయి. శనివారం 21.290 ఎంయుల విద్యుత్‌ను రూ.17.537 కోట్లతో పంపిణీ సంస్థలు కొనుగోలు చేశాయి. శుక్రవారం రూ.8.433లతో 21.324 ఎంయులను రూ.17.983 కోట్లతో ప్రైవేట్‌ నుంచి తీసుకున్నాయి. వినియోగం తగ్గిన రోజుల్లో కూడా అధిక ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో రెండు వారాల నుంచి వాతావరణం చల్లగా ఉండటం, కొన్నిచోట్ల వర్షాలు పడటంతో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ పడిపోయింది. మేలో రోజువారీ డిమాండ్‌ సాధారణంగా 240 మిలియన్‌ యూనిట్లు (ఎంయు)లకు పైనే ఉంటుంది. ఈ నెల 6వ తేదీన 255.8 ఎంయుల డిమాండ్‌ నమోదైంది. ఆ మరుసటి రోజు నుంచి విద్యుత్‌ వినియోగం పడిపోయింది. గడిచిన రెండు వారాల్లో 15వ తేదీ మాత్రమే 226.236 ఎంయుల డిమాండ్‌ నమోదైంది. గతేడాది మే 18వ తేదీన విద్యుత్‌ డిమాండ్‌ 251 ఎంయులు నమోదవ్వగా, ఈ ఏడాది అదే రోజు (శనివారం) 210.35 ఎంయులు మాత్రమే నమోదైంది.

➡️