డిజిపిగా హరీష్‌కుమార్‌ గుప్తా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర డిజిపిగా 1992 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈ మేరకు తక్షణం బాద్యతలను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఆదేశించడంతో సోమవారం సాయంత్రం మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఇంచార్జీ డిజిపి శంఖబ్రత బాగ్చీ నుండి ఆయన బాద్యతలను స్వీకరించారు. రాష్ట్ర డిజిపిగా వున్న కెవి రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం బదిలీ చేస్తూ సోమవారం ఉదయానికంతా ముగ్గురు అధికారులతో జాబితాను పంపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీష్‌కుమార్‌ గుప్తా పేర్లను ప్రతిపాదించారు. ఈ మూడు పేర్ల నుండి హరీష్‌కుమార్‌ గుప్తా పేరును డిజిపిగా ఎన్నికల కమిషన్‌ ఎంపిక చేసింది. ప్రస్తుతం హౌమ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరిగా పనిచేస్తున్న హరీష్‌కుమార్‌ గుప్తా మొదట ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం ఎఎస్‌పిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన మెదక్‌, పెద్దపల్లిలో ఎఎస్‌పిగా, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో అడిషనల్‌ ఎస్‌పిగా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు, నల్గొండ జిల్లాలకు ఎస్‌పిగా పని చేశారు. సిఐడిలో ఎస్‌పిగా పనిచేశారు. హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ డిసిపిగా పనిచేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిఐజిగా, లా అండ్‌ ఆర్డర్‌లో ఐజిగా, అడిషనల్‌ డిజి హౌదాలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా వున్నారు.

➡️