పెండింగ్‌లో ఆమంచి నామినేషన్‌

Apr 27,2024 08:14 #AP, #nomination is pending
politica parties election sefalogist

-తెనాలిలో ఇద్దరి కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
-పలుచోట్ల ఉత్కంఠ
ప్రజాశక్తి-యంత్రాంగం :బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెనాలి ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌తో పాటు పలువురి అభ్యర్థుల నామినేషన్ల స్క్రూృటీలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో, ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులు కోరిన సమాచారాన్ని సమర్పించడం, నామినేషన్‌ ఫారాల్లో లోపాలను సరిదిద్దుకోవడంతో నామినేషన్లకు ఆమోదముద్ర పడింది.
ఆమంచికి చెందిన రొయ్యల చెరువులకు సంబంధించి రూ.కోట్లలో విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని జర్నలిస్టు నాగార్జునరెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమంచి నామినేషన్‌ను అధికారులు పెండింగ్‌ పెట్టి ఈ ఆరోపణలపై పూర్తి ఆధారాలు సమర్పించేందుకు శనివారం ఉదయం పది గంటల వరకు అవకాశం ఇచ్చారు.
గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వేసిన ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లనూ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ తొలుత షేక్‌ బషీర్‌కు, ఆ తర్వాత డాక్టర్‌ చందు సాంబశివుడుకు బిాఫారం ఇచ్చింది. రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో బషీర్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రఖర్‌ జైన్‌ ప్రకటించారు. బషీర్‌కు ఇచ్చిన బిాఫారాన్ని రద్దు చేయకుండా డాక్టర్‌ చందు సాంబశివుడుకు కాంగ్రెస్‌ పార్టీ మరో బిాఫారం ఇవ్వడం, అఫిడవిట్లో తప్పులు ఉండడంతో సాంబశివుడు నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ఆర్‌ఒ తెలిపారు.
నంద్యాల జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన నామినేషన్లో ఆస్తులు, అప్పుల వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తొలుత పక్కన పెట్టారు. సాయంత్రంలోపు వివరాలు పూర్తిగా పేర్కొనాలని సమయం ఇచ్చారు. బుగ్గన తరఫున న్యాయవాదులు ఆ వివరాలు సరి చేయడంతో నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో వైసిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ప్రభుత్వానికి చెందిన గుడివాడ పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని ఉపయోగించుకున్నట్టు అఫిడవిట్‌లో చూపలేదని టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డిఒ తిరస్కరించి ఆయన నామినేషన్‌ను ఆమోదించారు.
విశాఖ జిల్లా పెందుర్తి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎ.అదీప్‌రాజు నామినేషన్‌ పత్రాల్లో తప్పులు ఉన్నాయని ఆర్‌ఒ శేష శైలజకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో, నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఒ పరిశీలించి అఫిడవిట్‌లో ఒక చోట టిక్‌ లేదని, తేదీ కూడా వేయలేదని గుర్తించి నామినేషన్‌ను తొలుత పెండింగ్‌లో పెట్టారు. ఆ సమాచారాన్ని అదీప్‌రాజుకు తెలియజేశారు. వాటిని అదీప్‌రాజ్‌ పూర్తి చేయడంతో నామినేషన్‌ను ఆర్‌ఒ ఆమోదించారు.

➡️