అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్న ఐసిసి : ఇజ్రాయిల్‌

జెరూసలెం :    దేశ నేతలకు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) నోటీసులు జారీ చేయవచ్చని ఇజ్రాయిల్‌ అధికారులు సోమవారం పేర్కొన్నారు. గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను నిలిపివేయాలంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. తమ సీనియర్‌ నేతలు, మిలటరీ అధికారులకు ఐసిసి వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఇజ్రాయిల్‌ మిషన్స్‌ నుండి ‘సమాచారం’ అందిందని  విదేశాంగ  మంత్రి  ఇజ్రాయెల్  కాట్జ్‌ తెలిపారు. ఇటువంటి వారెంట్లు హమాస్‌, ఇతర తీవ్రవాద సంస్థలకు మరింత ఉత్సాహం  కలిగించవచ్చని ఆరోపించారు. ఇటీవల గాజాకు మరింత మానవతా సాయాన్ని అనుమతిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ వరుస ప్రకటనలు… ఐసిసి చర్యలను ఎదుర్కొనే లక్ష్యంతోనే కావచ్చని సమాచారం.

2014 ఇజ్రాయిల్‌ -హమాస్‌ యుద్ధంపై ఇజ్రాయిల్‌, పాలస్తీనా మిలిటెంట్ల యుద్ధ నేరాలపై ఐసిసి మూడేళ్ల క్రితం విచారణ చేపట్టింది. అయితే వారెంట్‌ జారీ చేస్తున్నట్లు ఐసిసి ఎటువంటి సూచన జారీ చేయలేదు.

రఫాపై దాడి.. ఐదురోజుల నవజాత శిశువు సహా 22 మంది మృతి
ఆదివారం రాత్రి నుండి సోమవారం వరకు దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరిపినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ పేర్కొన్నారు. ఈ దాడిలో 22 మంది మరణించారని తెలిపింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులతో పాటు ఐదు రోజుల నవజాత శిశువు కూడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

➡️