రంగంలోకి సిట్‌ నరసరావుపేటలో ఘర్షణలపై ఆరా

  • తిరుపతి, తాడిపత్రికి చేరిన బృందాలు

ప్రజాశక్తి- గుంటూరు, అనంతపురం ప్రతినిధులు, తిరుపతి బ్యూరో :ఎన్నికలను పురస్కరించుకుని పోలింగ్‌ రోజున, ఆ తరువాత జరిగిన ఘర్షణపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ప్రారంభించింది. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై ఏర్పాటైన సిట్‌ శనివారం సాయంత్రం నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేటలోని టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఈ బృందం అధికారులు ఘర్షణల్లో నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పరిశీలించారు. ఘర్షణలకు సంబంధించిన నమోదైన కేసులు, తీసుకున్న చర్యలు, నిందితుల వివరాలు, దాడులు, ప్రతి దాడులు, వాహనాల ధ్వంసం, వాహనాల దగ్ధం ఘటనలపై సిట్‌ బృందం అధికారి, అదనపు ఎస్‌పి సౌమ్యలత నేతృత్వంలో ఆరా తీశారు. ఈ ఘర్షణల్లో పాల్గొన్న వ్యక్తులు, వారి గతం, ఆస్తి నష్టం, శాంతిభద్రతల సమస్య ఏర్పడితే తీసుకున్న చర్యల వివరాలను పట్టణ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిట్‌ బృందం పరిశీలన నేపథ్యంలో పోలీసు స్టేషన్‌ దరిదాపులకు ఎవరినీ రానివ్వలేదు. మీడియానూ అనుమతించలేదు.
కారంపూడిలో 19 మంది అరెస్టు
కారంపూడిలో ఈ నెల 14న ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 19 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిలో వైసిపికి చెందిన 11 మంది, టిడిపికి చెందిన ఎనిమిది మంది ఉన్నారు.
తిరుపతి, తాదిపత్రి చేరుకున్న సిట్‌ బృందాలు
ఇద్దరు సభ్యులతో కూడిన సిట్‌ బృందం శనివారం రాత్రి పది గంటల తర్వాత తిరుపతికి చేరుకుంది. ఈ బృందంలో డిఎస్‌పి రవిమనోహర ఆచారి, సి.ప్రభాకర్‌ ఉన్నారు. వీరు శ్రీ పద్మావతి అతిధి గృహంలో బస చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి కూడా సిట్‌ బృందం చేరుకుంది. ఈ రెండు బృందాలూ ఆదివారం నుంచి దర్యాప్తు ప్రారంభించనున్నాయి.

➡️