ఫ్రాన్స్‌ వర్శిటీలోకి పోలీసులు

May 4,2024 07:48 #gaja, #palasteena, #paris, #police, #students
  •  శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల అరెస్టు
  •  నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు

పారిస్‌ : ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్సెస్‌ పిఓ యూనివర్శిటీలోకి శుక్రవారం పోలీసులు ప్రవేశించారు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ ఆందోళన జరుపుతున్న విద్యార్ధులను కేంపస్‌ నుండి తరలించారు. దాదాపు 70మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా వ్యాప్తంగా కొన్ని కాలేజీ కేంపస్‌ల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో శాంతియుతంగా నిరసనలు కొనసాగుతు న్నా, విద్యార్ధులను పోలీసులు కేంపస్‌ భవనాల నుండి బయటకు తరలించారు. ఫ్రెంచి విద్యార్ధుల నిరసనలకు సైన్సెస్‌ పిఓ వర్శిటీ కేంద్రంగా మారింది. ఫ్రాన్స్‌వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతు న్నాయి. శుక్రవారం యూనివర్శిటీని మూసివేశారు. ప్రధాన భవనం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా యూనివర్శిటీ భవనాలను ఖాళీ చేయాలని, నిర్దేశించిన చిన్న ప్రాంతానికే పరిమితం కావాలని విద్యార్థులకు యూనివర్శిటీ అధికారులు అల్లిమేటమ్‌ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆ అల్లిమేటమ్‌ను తిరస్కరించారని జాక్‌ అనే విద్యార్ధి తెలిపారు. పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవడానికి ముందుగా వర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ, విద్యార్ధులతో నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఇజ్రాయిల్‌ యూనివర్శిటీలతో గల సంబంధాలను రద్దు చేసుకోవాలని విద్యార్ధులు కోరుతున్నారు. దానికి సైన్సెస్‌ పిఓ డైరెక్టర్‌ జేన్‌ బాసర్స్‌ తిరస్కరించారు. దీంతో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించినట్లు ఆందోళనకారులు తెలిపారు.
అమెరికాతో పోలిస్తే ఫ్రాన్స్‌లో ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నాయని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆసక్తి ఎక్కువగా వుందని ఫ్రాన్స్‌ యూదు విద్యార్ధుల యూనియన్‌ అధ్యక్షుడు శామ్యూల్‌ తెలిపారు.

➡️