ప్రధాని మోడీ భయపడుతున్నారు : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ భయపడుతున్నారని, స్టేజీపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. ”ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోడీ యత్నిస్తుంటారు. కొన్ని సార్లు చైనా, పాకిస్థాన్‌ల గురించి మాట్లాడతారు. కొన్ని సార్లు మిమ్మల్ని పళ్లాలు మోగించమని అడుగుతారు. మీ మొబైల్‌ ఫోన్స్‌ల్లో టార్చ్‌లైట్‌ని ఆన్‌ చేయమని అడుగుతారు” అని అన్నారు.

భారత్‌లో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల సహా కొన్ని కీలకాంశాలు ఉన్నాయని, కేవలం కాంగ్రెస్‌ మాత్రమే నిరుద్యోగాన్ని నిర్మూలించగలదని, ధరల పెరుగుదలను అదుపు చేయటలదని, ప్రజలకు వారి వాటాను అందించగలదని అన్నారు.

ప్రధాని మోడీ పేదల నుండి డబ్బు దోచుకుని, కొందరిని మాత్రమే కోటీశ్వరులను చేశారని మండిపడ్డారు. దేశంలోని 70 కోట్ల మంది ప్రజల సంపదకు సమానమైన సంపద కేవలం 22 మంది వద్ద మాత్రమే ఉందని, దేశంలోని 40 శాతం సంపదను కేవలం ఒక్క శాతం మంది మాత్రమే నియంత్రిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పథకంలో దళితులు, ఒబిసిలు, గిరిజనులు, మైనారిటీలు, పేద, సాధారణ కేటగిరీ ప్రజలకు ఎలాంటి అవకాశం లేదని అన్నారు.

ఒక్క లైన్‌లో చెప్పాలంటే .. కొందరు బిలియనీర్లకు ప్రధాని ఏ సంపదనైతే దోచిపెట్టారో .. అదే సంపదను తాము దేశంలోని పేద ప్రజలకు పంచి పెడతామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవి గతంలో జరిగిన ఎన్నికల వంటివి కాదని, భారత దేశ చరిత్రలో మొదటిసారి ఓ పార్టీ, ఓ వ్యక్తి   ప్రజాస్వామ్యాన్ని,  రాజ్యాంగాన్ని  నాశనం చేయాలనుకుంటున్నారని, వారికి బుద్ధి చెప్పాలని అన్నారు.

➡️