దారి తప్పిన సెలయేరు

Apr 29,2024 05:45 #kavithalu

వేయికాళ్లతో నగవులెత్తే
రోకలిబండిలాంటి రైలు అప్పర్‌ బెర్త్‌ మీద
ఓ ఆరు వసంతాల బాలుడు
సెల్‌ ఫోన్‌లో సర్వైవల్‌ గేమ్‌ ఆడుతున్నాడు..!

ఆటలో మునిగి తేలుతూ ..
‘ఇదిగో వీడొస్తున్నాడు బాంబు వెయ్యి
అదిగో వాడ్ని షూట్‌ చెరు
ఆ కత్తితో వాడ్ని పొడువం’టూ అరుస్తున్నాడు
నెత్తుటి భాషతో ..!

పెరటి తోటలో
పూవుల్లా పరిమళించాల్సిన పిల్లలు
పచ్చని నేల మీద
ప్రాణవీచికల్లా పారాడాల్సిన పిల్లలు
దేశ ధ్వజస్తంభం మీద
భావి దీపాలై ప్రకాశించాల్సిన పిల్లలు
యివాళేమిటిలా ..
హింసను ఎదనిండా పులుముకొని
నెత్తుటివాగులో కొట్టుకుపోతున్నారు!

కరుణ, జాలి పూయాల్సింది పోయి
వారి పసి మనసుల పలకల మీద
నిర్దయ హింస అనే పదాల్ని దిద్దిస్తున్నదెవరు?
పూలమీదా, సీతాకోకలమీదా
కరకుతనాన్ని కత్తుల్లా విసురుతున్నదెవరు?

వాళ్లివాళ.. దారి తప్పుతున్న సెలయేళ్లు
కనిపించని మంటల్లో
తగలబడుతున్న పూలతోటలు
వాళ్ల పసి మనసుల మీద
పేరుకుపోయిన నీలిమరకల్నీ
నెత్తుటి చారికల్నీ నిప్పుతో కడిగీ
మంచిగంధం పూతపూసే మనుషులు కావాలిప్పుడు!
– సిరికి స్వామినాయుడు
94940 10330

➡️