రిజర్వేషన్లకు ప్రాతిపదిక వెనుకబాటుతనమే

May 19,2024 08:35 #cpm, #Sitaram Yechury
  •  ఓబిసి రిజర్వేషన్లు మండల్‌ కమిషన్‌ సిఫారసులతోనే ఉనికిలోకి
  •  అస్సాం సిఎం వ్యాఖ్యలపై ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రిజర్వేషన్లకు వెనుకబాటుతనమే ప్రాతిపదిక అని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్ఠం చేశారు. రిజర్వేషన్లపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఏచూరి, ఆయనకు భారత దేశ చరిత్ర గురించి బొత్తిగా తెలిసినట్లు లేదని అన్నారు. రాజ్యాంగం ఒబిసిల రిజర్వేషన్‌ గురించి ఎక్కడా పేర్కొనలేదని, మండల్‌ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాతే ఒబిసిల రిజర్వేషన్లు ముందుకు వచ్చాయని ఏచూరి చెప్పారు. అంబేద్కరే ఓబిసిలకు రిజర్వేషన్లు ఇచ్చారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పడమంటే ఆయనకు చరిత్ర గురించి తెలియకపోయి అయినా ఉండాలి. లేదా మండల్‌ కమిషన్‌ పేరు ఉచ్ఛరించడానికి ఇష్టం లేకనే పేరును ప్రస్తావించకపోయి ఉండాలి అని సిపిఎం నేత అన్నారు. తమకు అనుకూలమైన సొంత చరిత్రను వారు సృష్టించు కుంటున్నారు. తమకు 400 సీట్లు కావాలని బిజెపి అడుగుతున్నది ఎందుకంటే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానే మనుస్మృతి ఆధారంగా భారత సమాజాన్ని తిరిగి నిర్మించాలని,ఫాసిస్టు నియంతృత్వ పాలన సాగించేందుకేనని ఆయన అన్నారు. దీనిని ఈ దేవ ప్రజలు తిరస్కరిస్తారని ఏచూరి తెలిపారు. రాజ్యాంగం గురించి తెలియకుండానే ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంతకన్నా దౌర్భాగ్యమేముంటుంది.రిజర్వేషన్లకు ప్రాతిపదిక. మతం కాదు. ఎస్‌సి, ఎస్‌టిలు వెనుకబడినందున రిజర్వేషన్లు ఇచ్చారు. అంతేతప్ప హిందూ మతంలో భాగం వల్ల రిజర్వేషన్లు ఇవ్వలేదు. అదే వెనుకబాటుతనంతో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, నాస్తికులకు కూడా రిజర్వేషన్లు ఇస్తారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక వెనుకబాటుతనమే. వారికి (బిజెపి) రాజ్యాంగం అర్థం కాదు.

➡️