న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలి

  •  ‘ప్రబీర్‌ పుర్కాయస్థ’ విడుదలను స్వాగతిస్తూ జరిగిన సభలో వక్తలు
  •  ‘అలుపెరగని పోరాటం’ ఆవిష్కరించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు

ప్రజాశక్తి- విజయవాడ : న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థనూ తన గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనికి ప్రముఖ మేధావి, న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్ధ అక్రమ అరెస్టే నిదర్శనమన్నారు. ప్రబీర్‌ పుర్కాయస్థ అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ శనివారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్లో సభ జరిగింది. ముందుగా ‘అలుపెరగని పోరాటం’ ప్రబీర్‌ పుర్కాయస్థ ఆత్మకథ పుస్తకాన్ని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యకర్త గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయని వివరించారు. వీటిని మోడీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఢిల్లీలో జరిగిన మహత్తర రైతు ఉద్యమాలు, సిఎఎ వ్యతిరేక ఉద్యమాలు… ఇలా అనేక పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారనే కారణంతోనే ప్రబీర్‌ పుర్కాయస్థ గొంతునొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి, ఎనిమిది నెలలపాటు జైలులో ఉంచిందని, సుప్రీంకోర్టు జోక్యంతోనే ఆయన విడుదల సాధ్యమైందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, వామపక్షవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఆనాడు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించగా, ప్రస్తుత మోడీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ఏ కారణమూ చూపకుండా అత్యంత దుర్మార్గమైన, ప్రమాదకరమైన ఉపా చట్టాన్ని ప్రబీర్‌ పుర్కాయస్థపై మోపి నెలల తరబడి జైలు పాలు చేసిందన్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబా, స్టాన్‌స్వామి లాంటి వందలాది మంది మేధావులపైనా, అభ్యుదయవాదులపైనా ఈ చట్టాన్ని మోపి, జైళ్ల పాలు చేసి అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో ముస్లిములు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు ఉండరాదని, చివరికి సైన్స్‌ ఉండరాదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కత్తి కట్టాయన్నారు. బిజెపి-మోడీ ప్రభుత్వ పాలన అత్యంత ప్రమాదకరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపా చట్టం చాలా దుర్మార్గమైందని, అనేక మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు మాట్లాడుతూ పౌర సమాజం నిద్రాణంలో ఉంటే న్యాయవ్యవస్థ కూడా అలాగే ఉంటుందన్నారు. దేశంలో పరిపాలన, రాజకీయ వ్యవస్థను మార్చడం ద్వారానే న్యాయవ్యవస్ధలో కూడా మార్పును తీసుకురాగలుగుతామని పేర్కొన్నారు. ప్రజలు, పౌరసమాజం, వామపక్షవాదులు ఇందుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు మాట్లాడుతూ ప్రజలపక్షాన కాకుండా ప్రభుత్వాలకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తున్నాయని, ఇటువంటి తరుణంలో సంఘటితంగా ఉద్యమించి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలని కోరారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ పూర్వ సంపాదకులు, ‘అలుపెరగని పోరాటం’ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన కె.ఉషారాణి మాట్లాడుతూ ప్రజాజీవితంతో తన అనుభవాలు కాకుండా 50 ఏళ్లలో దేశంలో జరిగిన అనేక ఘటనలు, అనుభవాల చరిత్రను ప్రబీర్‌ పుర్కాయస్థ తన ఆత్మకథలో రాశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ కె లక్ష్మయ్య, నిర్వహుకులు వొరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️