నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

May 4,2024 11:30 #penctions

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే, గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు.. బ్యాంకులు ఓపెన్‌ చేయకముందే.. ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు.. అయితే, డీబీటీ ద్వారా డబ్బులు జమ కానివారికి ఇవాళ్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కోసం ఈ నెల 1,945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని.. మూడు రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. మొత్తం 16,57,361 మందిలో 15,95,482 (96.27 శాతం) మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది . 48,92,503 మందిలో 48,17,718 (98.47 శాతం) మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్టు పేర్కొంది.. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్‌ అందలేదని స్పష్టం చేసింది.. పెన్షన్‌ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.. ఈ రోజు, రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

➡️