Lok Sabha Elections : మూడో దశ పోలింగ్ ప్రారంభం

May 7,2024 08:09 #3rd fase, #election
  •  95 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌
  •  మొత్తం 1,351 మంది అభ్యర్థులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మూడవ విడతలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడవ దశలో బరిలో ఉన్న ముఖ్యుల్లో కేంద్ర మంత్రులు అమిత్‌ షా (గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), బిజెపి తిరుగుబాటు నాయకుడు కెఎస్‌ ఈశ్వరప్ప (షిమోగా), డింపుల్‌ యాదవ్‌ (మెయిన్‌పురి), శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (విదిశ), సుప్రియా సులే (బారామతి) తదితరులు ఉన్నారు. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది. మరోవైపు ఇప్పటికే ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌, ఇక ఏప్రిల్‌ 29న రెండో దశ పోలింగ్‌ పూర్తయ్యింది. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగనుంది.
తగ్గుతున్న పోలింగ్‌ శాతం
తొలి రెండు దశల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. మొదటి దశలో 66.14%, రెండో దశలో 66.71% ఓటింగ్‌ నమోదైంది. బిజెపికి కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటింగ్‌ శాతం తగ్గిపోవడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తంగా మరో 350 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది.

➡️