ఇదేమి నిష్పాక్షికత?

May 6,2024 03:30 #2024 election, #objectivity?
  • ఇసి తీరుపై ప్రశ్నలు, సందేహాలు
  • సిఎంలనూ అరెస్ట్‌ చేస్తున్నారు
  • మతం పేరుతో ఓట్లను దండుకోవాలని చూస్తున్నారు
  • ప్రధాని, మంత్రులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు
  • సూరత్‌లో బలవంతంగా ‘ఏకగ్రీవం’ చేయించారు

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌పై ప్రజలు, రాజకీయ పార్టీలకు విశ్వాసం రానురానూ సడలిపోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే దాని విశ్వసనీయత, స్వతంత్రతను పలువురు ప్రశ్నించారు. అప్పట్లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే 64 మంది ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు, సాయుధ దళాలకు చెందిన 83 మంది మాజీ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ ఘాటుగా ఓ లేఖ రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను వారు తప్పు పట్టారు. అవి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని, గత మూడు దశాబ్దాలలో ఇంత దారుణమైన పరిస్థితిని ఎన్నడూ చూడలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇసి పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈసారి కూడా పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ఓ ఫార్సుగా మార్చేసేందుకు కంకణం కట్టుకుంది. గత నెల 11న ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు ఇసికి ఓ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణపై ప్రజలు, రాజకీయ పార్టీల మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇసి చేస్తున్నది ఏమీ లేదని మండిపడ్డారు. ఇవిఎంల పనితీరు, వివి ప్యాట్ల లెక్కింపుపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికార పక్షం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవలి కాలంలో ఇసి చర్యలు వింతగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

పర్యవేక్షణకు స్వతంత్ర కమిటీ
ఎవరెన్ని లేఖలు రాసినా, అభ్యర్థనలు పంపినా ఎన్నికల సంఘం దున్నపోతు మీద వాన పడినట్లే వ్యవహరిస్తోంది. అబద్ధాలను పదేపదే వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పౌర సమాజ గ్రూపులు ఒక్కటై ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశాయి. మార్చి 15న ప్రారంభమైన ఈ కమిటీ స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, కోడ్‌ ఉల్లంఘనలపై ఇసికి ఎప్పటికప్పుడు నివేదికలు, వారానికి ఒక బులెటిన్‌ పంపుతోంది. వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు….

అరెస్టులతో సమానావకాశాలు ఎలా?
ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు కేవలం ఒక రోజు ముందు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను తొందరపాటుతో, నర్మగర్భంగా పక్షపాతపూరితంగా నియమించారు. ఏడు దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి, దాని స్టార్‌ క్యాంపెయినర్లు… ముఖ్యంగా ప్రధాని మోడీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంది. ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రతిపక్షానికే చెందిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను అరెస్ట్‌ చేసిన వెంటనే కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియలో అందరికీ సమానావకాశాలు ఎలా లభిస్తాయి?

మతం పేరుతో ఓట్ల అభ్యర్థన
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై ప్రభావం పడేలా ప్రధాన స్రవంతి మీడియాలో పక్షపాతపూరితమైన, సమతూకంగా లేని వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితా నుండి ఓ పద్ధతి ప్రకారం ముస్లింలు, దళితులు, ఇతర అణగారిన వర్గాల వారిని తొలగించారు. ఎన్నికల సీజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. వామపక్షాలకు ఆదాయపన్ను నోటీసులు ఇచ్చారు. అధికార బిజెపి నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మతాలను అభ్యర్థిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓట్లను అభ్యర్థిస్తూ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట, రామనవమిని ప్రస్తావిస్తున్నారు.బిజెపి మంత్రులు తమ ఎన్నికల సందేశాలలో సైనిక చిహ్నాలను దుర్వినియోగం చేశారు. మోడీ సైనిక యూనిఫారంలో ఉన్న వీడియోలను పోస్ట్‌ చేశారు. బిజెపి సీనియర్‌ నాయకులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతుంటే ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం స్వతంత్ర మీడియాను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాలలో మతపరమైన ప్రస్తావనలు తీసుకొస్తున్నారు. పౌర సమాజం పలు సందర్భాల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ, అందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇసి మాత్రం ఇవిఎంల భద్రత, పనితీరుపై ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. దీనిపై కేంద్ర సమాచార కమిషన్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇంత దారుణమా?
ఎన్నికల తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ ఇసి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధాని మోడీ ఏప్రిల్‌ 21న తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా ప్రసంగించారు. అయినా ఇసిలో కదలిక లేదు. ప్రధాని పేరును ప్రస్తావించకుండా బిజెపికి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్ద అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తూ సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, స్వతంత్ర అభ్యర్థులతో బలవంతంగా ఉపసంహరింపజేసి బిజెపి అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి తన నామినేషన్‌ను ఉపసంహరించుకొని బిజెపిలో చేరిపోయారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి బిజెపి నాయకుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలకు మాత్రం నోటీసులు జారీ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలి దశ పోలింగ్‌ జరిగిన 11 రోజుల తర్వాత ఓటింగ్‌ శాతాన్ని వెల్లడించింది.

➡️