వేల కోట్లు కుమ్మరింత

May 4,2024 07:38 #2024 election, #amount, #BJP

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లతో పాటు , ఇతర రూపాల్లో కార్పొరేట్‌ సంస్థల నుండి భారీ మొత్తంలో నిధులు గుంజుకున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎంత మొత్తం ఖర్చు చేయనుందో ఊహించగలరా? ఏకంగా 60,750 కోట్ల రూపాయలు! నమ్మశక్యం కావడం లేదా! బిజెపి గత ఎన్నికల్లో చేసిన ఖర్చును, ఇప్పటికే జరిగిన రెండువిడతల పోలింగ్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు చేసిన ఖర్చు ప్రాతిపదికగా పరిశీలకులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు వేస్తున్న అంచనాలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ వివరాలతో ‘ది వైర్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు చేస్తున్త్న ఖర్చును కూడా కలుపుకుంటే 2024 ఎన్నికల్లో బిజెపి అక్షరాల లక్ష కోట్ల రూపాయలపైనే ఖర్చు చేయనుంది! ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బిజెపికి అందింది ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం సుమారుగా 6 వేల కోట్ల రూపాయలే. అయినా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఎలా సాధ్యమంటే, నిధులు గుంజుకోవడానికి ఆ పార్టీకి ఉన్న మార్గాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

ఎంత మొత్తం …?
2015-16 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 వరకు ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం ప్రతి సంవత్సరం 5,744 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు బిజెపి తన అకౌంట్లలో చూపింది. అయితే, వివిధ సంస్థలు, పరిశీలకులు దీనికి భిన్నంగా చెబుతున్నారు. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సిఎంఎస్‌)తో పాటు పలు సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం ఒక్క 2019 ఎన్నికల్లోనే బిజెపి 27వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన మొత్తానికన్నా అధికంగా భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు పలు నివేదికలు తేల్చాయి. సిఎంస్‌ అధ్యయనం ప్రకారం 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు చేసిన మొత్తం వ్యయం 60వేల కోట్ల రూపాయలు. దానిలో బిజెపి వాటా సుమారుగా 45 శాతం. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఖర్చులో బిజెపి వాటా 20శాతంగానే ఉండటం గమనార్హం. 1998 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల నాటికి బిజెపి అదనంగా మరో 25శాతం ఖర్చు చేసింది. దీనికి రాష్ట్రాల శాసనసభ ఖర్చులు అదనం! పెరుగుదల రేటును పరిగణలోని తీసుకోకుండా కేవలం 2019 ఎన్నికల్లో చేసిన విధంగానే ఈ ఎన్నికల్లోనూ బిజెపి ఖర్చు చేస్తుందని భావిస్తే ఆ మొత్తం 60,750 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రాష్ట్రాల శాసనసభకు ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఖర్చు 40 లక్షల రూపాయలు. ఛత్తీస్‌గర్‌లో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని సన్నిహితంగా పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆ పార్టీ ఒక్కో నియోజకవర్గంలో మూడు, నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ పార్టీ అభ్యర్థులకు నేరుగా అందచేసింది. ఇది కాకుండా సోషల్‌ మీడియాతో పాటు ఇతర రంగాల్లో ప్రచారానికి విడిగా ఖర్చు చేసింది. బిజెపి అభ్యర్థులు కూడా సొంతంగా భారీ మొత్తంలోనే నిధులు ఖర్చు చేశారు. ఇదంతా కలిపి చూస్తే ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి, బిజెపి చేసిన ఖర్చుకు ఎక్కడా పొంతన ఉండదని వీరు చెబుతున్నారు. మరో అంచనా ప్రకారం జిల్లా కార్యాలయాల నిర్మాణానికి 2,661 కోట్ల రూపాయలను, ఇతర భవనాల నిర్మాణాలకు రూ.900 కోట్లు. రాష్ట్రాల ఎన్నికలకు 16,492 కోట్ల రూపాయలు. లోక్‌సభ ఎన్నికలు 54 వేల కోట్ల నుండి 87,750 కోట్ల రూపాయల వరకు బిజెపి ఖర్చు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇంత మొత్తం ఎక్కడ నుంచి ?
బిజెపికి ఇంత మొత్తంలో నిధులు ఎక్కడ నుండి, ఎలా అందుతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా బిజెపి పెద్ద ఎత్తున కార్యాలయాలను నిర్మిస్తోంది. వీటితో పాటు ఎన్నికల ప్రచారానికి కలిపి అతి తక్కువగా అంచనా వేసినా 1.07 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది బిజెపి 2014 -15 నుండి 2022-23 వరకు అధికారికంగా ప్రకటించిన 14,663 కోట్ల రూపాయల ఆదాయంతో పోలిస్తే ఐదు నుండి ఏడు రెట్లు ఎక్కువ! దీనిని పరిగణలోకి తీసుకుంటే ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఆ పార్టీకి అందింది కేవలం 10శాతం మాత్రమే!

➡️