Varun Gandhi : చివరి శ్వాస వరకు ఇక్కడి ప్రజలతో కొనసాగుతా

న్యూఢిల్లీ :    చివరి శ్వాస వరకు పిల్‌భిత్‌ నియోజకవర్గంలోని ప్రజలతో తన బంధం కొనసాగుతుందని బిజెపి ఎంపి వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. తనకు బిజెపి లోక్‌సభ ఎంపి టికెట్‌ తిరస్కరించడంపై వరుణ్‌ గాంధీ గురువారం మొదటిసారి ఎక్స్‌లో స్పందించారు. తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో  లేఖ రాశారు.

”ఎంపిగా నా పదవీకాలం ముగింపు దశకు వస్తోంది. అయినా పిల్‌భిత్‌ ప్రజలతో నా సంబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఎంపి పదవి లేకపోయినా, కొడుకుగా జీవితాంతం మీకు సేవ చేసేందుకు కట్టుబడి ఉంటాను. నా ఆలోచనలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి” అని లేఖలో పేర్కొన్నారు. ”ప్రజల గొంతుకను వినిపించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. చివరి వరకు ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు మీ ఆశీర్వాదాలు కావాలి” అని తెలిపారు. తనతల్లివేలు పట్టుకుని 1983లో మొదటిసారిగా పిల్‌భిత్‌కు వచ్చిన రోజు తనకు గుర్తుందని, అయితే ఆ ప్రాంతం నుండే తాను ఎంపిగా గెలుస్తానని, చివరికి వారే తన కుటుంబంగా మారతారని అతనికి తెలియదని అన్నారు.

సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో ఈ సారి వరుణ్‌గాంధీకి బిజెపి టికెట్‌ నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవల బిజెపి తీర్థం పుచ్చుకున్న జితిన్‌ ప్రసాదను పిల్‌భిత్‌ నుండి బిజెపి బరిలోకి దింపింది. అయితే వరుణ్‌గాంధీ కాంగ్రెస్‌లోకి వెళతారన్న వార్తలు వెలువడ్డాయి. అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాది పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

➡️