ఇన్ని ఫిర్యాదులు చేసినా చర్యలేవీ ?

  •  ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించిన సీతారాం ఏచూరి
  •  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మరో లేఖ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం ఒక లేఖ రాశారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్‌ మౌనం పాటించడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బిజెపి నేతలు పలువురు ఎన్నికల కోడ్‌ను పదే పదే ఉల్లంఘిస్తున్న అంశాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు., బిజెపి నేతలు చెబుతున్న అసత్యాలు, కట్టు కథలు, విద్వేషాలు రెచ్చగొట్ఠడం వంటి వాటి గురించి లేవనెత్తామని ఏచూరి ఆ లేఖలో గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ, వీటిల్లో ఏ ఒక్కదానిపైనా ఎన్నికల కమిషన్‌ స్పందించలేదని, దోషులను శిక్షించలేదని ఏచూరి పేర్కొన్నారు.
ఈ రుగ్మతను మొగ్గలోనే తుంచేసేలా తక్షణమే దోషులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా ఇసి మౌనం వహించిందని ఏచూరి విమర్శించారు. దీనిని అలుసుగా తీసుకుని బిజెపి నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ నెల 16న యుపిలోని బారాబంకీలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ”సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే, తిరిగి రామాలయాన్ని బుల్డోజరుతో ధ్వంసం చేస్తారని” నిర్లజ్జగా మాట్లాడారు.
సర్నాలో ఈ నెల 17న ఎన్నికల ర్యాలీలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ, ”కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాల్లో భాగమే ఇది. కేవలం ముస్లింలకు లబ్ది చేకూరేలా మతం ప్రాతిపదికన వారు రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల కోటాలను దోచేసి, వాటిని ముస్లింలకు అందజేయాలని కాంగ్రెస్‌, ఆర్‌జెడిలులు ప్రయత్నిస్తున్నాయి.” అని ఆరోపించారు.
సివాన్‌లోని రఘునాథ్‌పూర్‌లో ఎన్నికల సభలో ఈ నెల 18న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ, ఎన్‌డిఎ తిరిగి అధికారంలోకి వస్తే యుసిసిని తీసుకువచ్చి, ఇలా నాలుగుసార్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి స్వస్తి చెబుతుందన్నారు. మదరసాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ముల్లాలను ఉత్పత్తి చేసే దుకాణాలను కూడా మూసేస్తామని చెప్పారు.
గతంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏచూరి ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. పైన పేర్కొన్న ఫిర్యాదులకు గానూ మోడీ, యోగి ఆదిత్యనాథ్‌, హేమంత బిశ్వశర్మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
తప్పు చేసిన వారందరూ ఉన్నత పదవుల్లో వున్నారనే కారణాలతో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైనట్లైతే, కమిషన్‌ నిష్పాక్షికత ప్రశ్నార్ధకంగా మారుతుందని, విశ్వసనీయత దెబ్బ తింటుందని ఏచూరి స్పష్టం చేశారు.

➡️