‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

న్యూఢిల్లీ బ్యూరో :కరీంనగర్‌ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023కు గాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మళయాళం, తమిళ్‌, నేపాలీ, ఉర్థూ, ఒడిశా వంటి ఇతర భాషల్లో 24 మంది అనువాదకులకు సోమవారం సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఇంగ్లీష్‌లో పవన్‌ కె వర్మ రచించిన ‘గాలీబ్‌: ది మ్యాన్‌’ పుస్తకాన్ని ‘ఎలనాగ’ తెలుగులోకి ‘గాలీబ్‌ నాటి కాలం’ పేరుతో అనువాదం చేశారు. అనువాద విభాగంలోఈ పుస్తకం అవార్డుకు ఎంపికైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కార గ్రహీతలకు రూ. 50 వేల నగదు, తామపత్రం అందించనున్నట్లు సాహిత్య అకాడమీ వెల్లడించింది. కాగా, వఅత్తిపరంగా చిన్నపిల్లల వైద్యుడైన ఎన్‌ సురేంద్ర-ఎలనాగ పేరుతో సుప్రసిద్దులయ్యారు. కరీంనగర్‌ లోని ఎలగందల గ్రామంలో జన్మించిన ఆయన పాఠశాల స్థాయిలోనే రచనలు ప్రారంభించారు. విద్యార్థిగా తాను రాసిన కవిత మొదటి సారిగా కరీంనగర్‌ నుంచి ప్రచురితమైన ‘గౌతమి’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఎలనాగ తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ రచనలు చేశారు. ఆయన ఆంగ్లంలో రాసిన కవిత సంపుటి ‘డాజ్లర్స్‌’ ను ఉకియోటో ప్రచురణ సంస్థ ముద్రించింది. ఆ సంపుటిని టర్కిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, రష్యన్‌, చైనీస్‌, జపనీస్‌ భాషల్లోకి అనువాదం అయ్యాయి. అలాగే ఇప్పటి వరకు దాదాపు 40 గ్రంధాలను ఎలనాగ ప్రచురించారు. కలుపు మొక్క, వాగంకురాలు, పెన్మంటలు-కోకిలమ్మ పదాలు, కొత్తబాని వంటివరి సాహిత్య లోకాన్ని అలరించాయి.

➡️