విన్నపాలు వినవలె..

Jan 22,2024 10:10 #sahityam

ఆయన చెప్పాడంటే చేస్తాడంతే…

అక్కచెల్లెమ్మలకు అండనేనంటే

నమ్మేశామంతే…

విన్నపాలు వినవలెనంటూ మొరపెట్టామెంతో

జీవితాలు నిలబెడతాడని ఆశించామెంతో

పండుగ పూటైనా అన్నలా వరమిస్తాడనుకుంటే

సంక్రాంతి కానుకంటూ ఎస్మా, షోకాజు లొచ్చే…

 

గుర్రాలతో తొక్కించినా

నీటి పిరంగులు ప్రయోగించినా

అదరని బెదరని గుండెలవి

ఆప్యాయతను పంచే అమ్మలే కాదు…

అపర కాళికలు కూడా…

మాతత్వం, మమకారం పంచగలరు

చీపురు పట్టిన… గరిట తిప్పిన

చేతుల సత్తానూ చూపగలరు…

 

స్త్రీల సమస్యలు, హక్కులు…

స్త్రీలవి మాత్రమే కాదు.. మొత్తం సమాజానివి

వారి కడుపు పండితే పుడమి పులకిస్తుంది

వారి కడుపు మండితే జగతి జ్వలిస్తుంది

వారి చేతనలో… చరిత్రలో

ఉద్యమాలు చైతన్య స్రవంతులౌతాయి

వారిలో చైతన్యం నిరసన గళమెత్తితే…

ప్రభుత్వాలే అతలాకుతలమౌతాయి

 

వేగు చుక్కలై… వెలుగు రేఖలై

భవిష్యత్‌ ఉద్యమాలకు

క్రాంతిధారలై… ప్రగతిగామిలై

మీరు చూపిన మార్గం

మీరు రాసిన నిరసన కావ్యం

మీరు చేసిన ఉద్యమ గానం

శ్రామిక కార్మిక కర్షకోద్యమాలకు

వెలుగుదారి… ఇది రహదారి!

 

వారి అడుగుల రాపిడిలో

ఆరని చైతన్యం పుడుతుంది

అది ఓదార్పునిచ్చే అమ్మలా వుండాలో

ఉప్పెనలా ఎగసే ఆదిశక్తులవ్వాలో…

తేల్చుకోవాల్సింది మీరే…

మీదే మీదే…. నిర్ణయం మీదే..!

– రాజాబాబు కంచర్ల

➡️