కరువు పాట

Dec 23,2023 08:58 #sahityam

ఎండు మేఘంపై

తొలి కోడి ఆర్భాటంగా కూసింది

బోసిపోయిన నేలమ్మ

గట్టిగా ఆవులించింది

సీమలో చింతాకుకే వరం

పొలంలో కలుపుకు బలం.

 

ఏ పాటైనా

కరువు పల్లవితో మొదలౌతుంది

ఏ రాగమైనాఏడుపుతోనే ఆరంభమౌతుంది

ఆకలి పాటంటే

కడుపు తరుక్కుపోయి

జీవితం ఉలిక్కిపడుతుంది.

 

మూగబోయిన కోయిల

వలస పాటల రాగాలను ఆలపిస్తూ

చిగురు మరచిన చింతతో

కరువు గాయాలకు

లేపనం రాస్తూ మూగబోయింది.

 

నిరుపయోగపు నీటితో ఏరు

కడుపు నింపుకుంటోంది

మోటు విరిగిన నాగలి

మారుమూలన కూలబడింది

రైతు కన్నీటి తడుపులతో పంట

కొన ఊపిరితో

కొట్టుమిట్టాడుతోంది.

 

రాయలసీమ ఆకలి పాటకు

కలుపు మొక్కల నేల తాళం వేసింది

అరువు మద్దెల జోరు జోరుగా

రైతు వీపున మారుమోగింది

బతకలేని సగటు బతుకు

కాలానికి ప్రణమిల్లింది.

– నరెద్దుల రాజారెడ్డిసెల్‌ : 9666016636

➡️