కొత్త వెలుగుల పంట

Jan 1,2024 10:12 #sahityam

అన్నా…

కొత్త సంవత్సరం వచ్చిందంటే

కోటి చుక్కల్ని తెంపి

కళ్ళల్లో నింపుకుంటావ్‌

కొత్త కోర్కెల్ని తెచ్చి

గుండెల్లో వొంపుకుంటావ్‌

 

రంగు రంగుల ముగ్గుల్ని

రుతువుల మాగాణం నిండా

మొక్కలు మొక్కలుగా

అలంకరించుకుంటావ్‌!

వెండి జిలుగుల మబ్బుల్ని

కల్లం నాపరాయి నిండా

కంకులు కంకులుగా

కుప్పలు పోసినట్టు కలలు కంటావ్‌!

 

అప్పుడాక్షణం ఏ తర్కబద్ధ ఆలోచనా

నీ మెదడులో మొలకెత్తదు

మారే కాలానికి బతుకుల్ని

మార్చేంత మహత్తు ఉండదన్న వాస్తవం

నీ జ్ఞానేంద్రియాలకు స్ఫురించదు

 

కానీ, అన్నా … కనిపిస్తున్న

కఠిన వాస్తవం అదే కదా!

కాలం మూగది

ఎవ్వరినీ ఏమీ అనలేనిది

ఏ భావోద్వేగాలకూ లొంగని

మౌన గడియారంలో ముల్లు లాంటిది!

 

చేతికొచ్చిన చెమటపంట

నోటికందకుండా

ప్రకృతి లాక్కుపోతేనో

కుట్రల గుంటనక్కలు తన్నుకుపోతేనో

కాపాడలేదని కాలాన్ని నిందిస్తే

ప్రయోజనం ఏముంటుందన్నా!

జీవితం ఎప్పుడూ

కాలం ఒళ్ళోంచి వూడిపడదు!

కాలం నీ గాయాలను మాన్పే

గ్యారంటీ కార్డు కాదు కదా!

 

కారణాలు పసికట్టి

బతుకు పోరాటంలో

యుద్ధ తంత్రాన్ని మార్చాల్సిందే!

 

దశాబ్దాల తరబడి నువ్వు నడుస్తున్న దారి

గుంటలు పడి మురుగు నీరు చేరి

అడ్డమైన బురద పందులూ దొర్లుతున్నప్పుడు

నీ కార్యాచరణ కాలి బాటను

మరమ్మతులు చేస్తే సరిపోతుందా?

చైతన్యవంతమైన కొత్త రోడ్డును నిర్మించుకుంటేనే

పండించుకున్న కొత్త వెలుగుల పంట

నోటికందుతుంది!

తుమ్మ డొంకలు మొలిచిన

బతుకు బంజరు భూమి సారవంతమై

అడ్డ గాడిదల్ని అడ్డుకుంటుంది!

– పతివాడ నాస్తిక్‌94417 24167

➡️