యుద్ధ విరామం

Mar 11,2024 08:19 #sahityam

నువ్వు నేను
ఒకే క్షితిజ రేఖపై ఉన్నామంటావు
అందరం సోదరులం అనే మాట నీటిలో రాసావని తెలీలేదు.
ఆప్యాయంగా కౌగిలించావనే అనుకున్నా
వెనుక నెత్తురోడుతూ అడుగులు వేస్తున్న నా నీడను చూసేవరకు.

సరిహద్దులు కాలుదువ్వుతుంటే
లోపల కత్తులు, క్షిపణులు పోటాపోటీగా తయారవుతున్నాయి.

ఆధిపత్యపు కాన్సర్‌
అడుగడుకో భాగాన్ని ఆక్రమిస్తోంది
ఎర్రని కణజాలాన్ని విస్తరిస్తూ.

ఆకలి, నిద్ర కలుసుకునేలోపు
తెగిపడ్డ దేహాలు వాటిని ఎడం చేస్తున్నాయి

దేహాల డంపింగ్‌ యార్డులు
ఎర్రటి నేలలు
కొత్త రోదనాగీతం ఆలపిస్తుంటే
రాబందులు దావత్‌ చేసుకుంటున్నాయి.

అరిచి అరిచి గొంతు పెగుల్చుకున్న
శాంతి మంత్రాలు తాత్కాలిక
ఉపశమనపు గుళికలయ్యాయి.
యుద్ధకాంక్ష కాస్త విరామం ప్రకటించింది !

– రాధకష్ణ కర్రి
99519 16499

➡️