ఓటేసే ముందు …

May 13,2024 03:30 #aksharam

ప్రజా ప్రభూ!
ప్రజాస్వామ్య దేశంలో
రాజ్యమూ నీదే,
దాన్ని తీర్చిదిద్దే బాధ్యతా నీదే
సేవకుల నియమించు కీలక సమయాన
నీ శక్తిని మర్చిపోకు ఆసక్తిని విడిచిపోకు
నీ ప్రతినిధి ఎంపికలో
నిర్లిప్తత చూపబోకు
నమ్మించి ముంచే వారిని
ఓ కంట గమనించు
మేలెంచిన మంచి వారిని
ఎంచుకొని దీవించు!

సిరాముద్ర రాజముద్రికను ధరించే వేళ
ఏమరుపాటు వహించబోకు
అనర్హులకు ఆసనమేస్తే
తలరాతలు తారుమారు
స్వార్థ పరులకు ఆయుధమిస్తే
నీ భవితకు శిరచ్ఛేదనం
అందుకనే, ఆలోచించు
ప్రచారార్భాటాల నడుమ
ప్రశాంత చిత్తంతో
విచక్షణ జ్ఞానంతో ఆలోచించు
అర్హుడనే గెలిపించు
నీ చూపుడు వేలితో శాసించు
రాజ్యమూ నీదే.. బాధ్యతా నీదే!
– డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931

➡️