పోరాటయోధురాలు సుధా భరధ్వాజ : ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌ : జాతీయస్థాయిలో స్త్రీల హక్కుల కోసం, సామాన్యుల కోసం పోరాడిన ధీరవనిత సుధా భరధ్వాజ అని ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే అన్నారు. 34వ విజయవాడ పుస్తకమహోత్సవం ఎనిమిదో రోజు గురువారం కేతు విశ్వనాథ రెడ్డి సాహిత్యవేదికపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించిన ‘సుధా భరద్వాజ’ రచన ‘ఉరి గది నుండి’ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. భారతీయ ప్రజల కోసం ఆమె అమెరికన్‌ పౌరసత్వం వదులుకుని మన దేశ పౌరసత్వం తీసుకున్నారనీ, ఇక్కడ న్యాయవాద వృత్తి చేపట్టారని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి ఉరికి సమాన కారాగార శిక్షకు సిద్ధపడిందని ఆమె వివరించారు. ఒక న్యాయవాదిగా నేరస్థులను కాకుండా, నేరాల వెనుక కారణాలను తెలుసుకుని సమాధానాలకు నిరంతరం ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ‘ఉరిగది నుండి’ పుస్తకం పూర్తిగా మహిళల కోణంలో విశ్లేషిస్తుందని ఆమె చెప్పారు. సుధా భరద్వాజ్‌ ఏ విలువలకు ప్రాతినిధ్యం వహించారో.. ఆ విలువను అర్థం చేసుకుని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ విచారణ ఖైదీలతో భారతీయ జైళ్లు నిండిపోతున్నాయన్నారు. వీరిలో అధిక శాతం దళితులు, బహుజనులు ఉన్నారని వివరించారు. అలాంటి ఖైదీల వెతలను సుధా భరధ్వాజ్‌ తన రచనల్లో ప్రతిఫలించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళా ఖైదీల బాధలను హదయం ద్రవించేలా అక్షరరూపం ఇచ్చిన రచయిత్రిని, అలాంటి రచనను అనువాదం చేయించి ప్రచురించి ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ను అభినందించారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రజాశక్తి బుకహేౌస్‌ పూర్వ సంపాదకులు కె.ఉషారాణి, స్వరూపరాణి పాల్గొన్నారు.

➡️