తొలి ప్రేయసి

Feb 12,2024 08:37 #sahityam

ఆ అమ్మాయి

అమావాస్య కన్నా అందమైంది

నవ్వితే సూర్యతేజం –

చెరువు గట్టు మీద చేద బావి దగ్గరకి

చంకన బిందెతో

వస్తూ పోతూ వయ్యారంగా కనిపించేది

నల్ల కందిరీగ

తెల్ల పరికిణీలో వస్తున్నట్లుండేది

నడకలో కదుల్తున్న లోలాకులు

నా హృదయాన్ని కదిలిస్తుండేవి

 

అలా చూస్తూనే

ఒకరినొకరు చూసుకుంటూనే

చూపుల్తోనే ప్రేమ పూలు

పూయించాం

చూపుల్తోనే ప్రేమ పావురాలెగరేశాం

చూపుల్తోనే ప్రేమ మందిరంలో జీవించాం –

పచ్చని పైర గాల్లో

ఎల్లప్పుడూ

సంజ్ఞా పరిచ్ఛేదం వరకే పరిమితమయ్యాం

ఏ దుష్ట సంధి కార్యమై పోలేదు

సమర్థం కాని సమాస పదాలవ్వడం చేత

ఇల్లూ, చుట్టూ లోకం విభేదించింది

కలలు క్రియారహితమైనాయి

 

కాల ప్రవాహంలో తాను, నేను

వ్యతిరేక దిశల్లోకి వెళ్లిపోయాం!

 

ఇప్పటికీ

నల్లరంగు చొక్కా అన్నా

నల్ల కళ్లద్దాలన్నా

నల్ల చీమన్నా

మిక్కిలి మక్కువపడతాను మనసులో –

 

ఇటీవలే తెలిసింది!

తాను చీకట్లో చీకటై పోయిందని

వెన్నెల రాత్రిలోని చంద్ర బింబం

ఆమె చిరు దరహాసం అడిగి తీసుకుందని

ఆమె లేని లోకంలోని ఈ ఖాళీని

ఇక దేనితోనూ పూరించలేమని …

– రవి నన్నపనేని 91821 81390

➡️