నయా నాయకులు

May 13,2024 03:15 #aksharam

ఎన్నికలు రాగానే
ప్రజలే మాకు దేవుళ్ళంటారు
ఎన్నికలవగానే మా నాయకుడే
మాకు దేవుడంటారు
అడవి మన సంపదంటారు
అధికారం రాగానే అడ్డగోలుగా దోచేస్తారు
నదులకి హారతులిస్తారు
నదిలోని ఇసుకను తోడేస్తారు
ప్రజలకు సేవ చేయటం కోసమే
రాజకీయాల్లోకి వచ్చామంటారు
కానీ, శవాలతో రాజకీయం చేస్తారు

ఓటుని నోటుతో కొని అందలమెక్కుతారు
పేదరికాన్ని రూపుమాపుతామంటారు
మార్పు మొదలైందంటారు
మసిపూసి మారేడుకాయ చేస్తారు
మతాల పేరుతో మంటలు రేపుతారు
కులాల పేరుతో కుట్రలు పన్నుతారు
ప్రజలను కళ్ళున్నా గుడ్డివాళ్ళని చేస్తారు

అన్నీ ఉచితమంటారు
అందల మెక్కగానే
నిత్యావసర ధరలు పెంచుతారు
కరెంటు ఛార్జీలు పెంచుతారు
పెట్రోల్‌ రేట్లు పెంచుతారు
పెంచిన రేట్లతో సామాన్యుల నడ్డి విరగ్గొడతారు

ఐదేళ్లకొకసారి వచ్చే
ఈ ఎన్నికల సమరంలో
అభివృద్ధికి ఓటెయ్యాలో
నీతికి ఓటెయ్యాలో
అవినీతికి ఓటెయ్యాలో
అంతిమ నిర్ణయం ప్రజలదే!
నిర్ణయించేది ఈరోజే!
– కోనేటి నరేష్‌,
84998 47863

➡️