సామాజిక సమస్యల్ని చిలికిన కవిత్వం

Jan 1,2024 10:35 #sahityam

ద్యమానికి ఊపిరులూదే పోరాటగడ్డ ఉద్దానం. ఆ ప్రాంతంలోని మారుమూల పల్లెలో పుట్టిన కవి బిడ్డ ‘నిశితాసి’. అసలు పేరు వంకల రాజారావు. వృత్తిరీత్యా పాత్రికేయుడు. ప్రవృత్తి పరంగా కవి, గాయకుడు. ‘కంజరి’ వాయించడంలో దిట్ట. నాలుగు దశాబ్దాలుగా సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. గతంలో దండోరా గేయాలు, వీరగొన్నమ్మ గొల్ల సుద్దులు, ఉద్దానం పాట, కన్నోరి కథ వంటి రచనలతో సుపరిచితమైన రచయిత. ఇటీవలే ‘కవ్వం’ పేరుతో తన గేయ కవితల సంపుటిని వెలువరించారు. ఉత్తరాంధ్ర సామాజిక సమస్యల పోరాట నేపథ్యంతో ఊపిరి పోసుకున్న రచనల పొత్తం ఇది.

సహజ వచన శైలితో సరళ వాడుక భాషలో సొంత గొంతుతో కలవరిస్తూ పలవరించే నిలువెత్తు నిరసన స్వరం నిశితాసిది. ముక్కుసూటితనం ఎక్కువ. వస్తు విస్తృతితోపాటు పలు సామాజిక సమస్యల్ని విభిన్న కోణాల్లో ఎండగడుతూ తూర్పారబెట్టడం ఈ కవి అంతర్గత చైతన్య దృష్టిని తేటతెల్లం చేస్తుంది.

”ఆకాశం తుమ్మితే/ ఉప్పొంగిన జలపాతం కాదుకఠిన శిలా రాళ్ళ నుంచి/ తన్నుకొచ్చిన గరిక మొలక జీవితం” అంటాడు ‘జీవనరాగం’ శీర్షికలో ఓ చోట. పలు ఆటుపోట్ల మధ్య నలిగి రాటుదేలిన సామాజిక జీవిత సంవేదనల్ని అనేక సుడులతో మెలికలు తిప్పి కాచి ఒడబోసిన అనుభవాలుగా తాత్త్విక దృష్టితో ఒడిసిపడతాడు. ఈ జీవన పోరాట సంఘర్షణల మధ్య అలుపెరగని సుదీర్ఘ రాజకీయ మలుపుల అంతర్వేదన ఆర్తిగా ముడిపడి ఉంది. మారుతున్న కాల పరిస్థితుల్ని మార్క్సిస్టు దృక్పథంతో అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొని చెప్పిన కఠోర సత్యాలివి. చరిత్ర ఎప్పుడూ ఒక జడ పదార్థం కాదు. అనేక సంక్షోభాల సమాహారాలతో పోటెత్తిన ఒక జనసముద్రం. దీని ఎల్లలను దాటి కాలం ముందుకు పోలేదు. ఈ తాత్త్విక భౌతిక సత్యాన్ని అంతర్లీనంగా చాటి చెప్పడమే ఈ కవి ఉద్దేశం.

”ఆది మానవుడెల్లి/ మర మనిషిని తెచ్చాడు

ఊరులన్నీ కలిసాయి/ ప్రపంచమే ఊరయ్యింది” అంటూ ఒక పరిణామ క్రమాన్ని ”వద్దురా ఈ కులమూ” కవితలో చిత్రిస్తారు నిశితాసి. కొంచెం లోతుగా మధించి చూస్తే ప్రపంచీకరణ నేపథ్యంలో పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన పెను విధ్వంసక మార్పులు ఆధునిక మానవ జీవన సరళి స్థితిగతుల్ని ఏ రీతిలో ప్రభావితం చేశాయో పొల్లుపోకుండా అక్షరరూపం ఇస్తాడు కవి. ప్రపంచమే ఒక కుగ్రామంగా రూపాంతరం చెందిన వైనాన్ని, వాటి దుష్ఫలితాల తీరుతెన్నుల్నీ నిప్పుల కుంపటి మీద మంటలా రాజేస్తాడు. అభివృద్ధి పేరుతో చాప కింద నీరులా ప్రపంచ దేశాల్ని ఆక్రమించుకున్న సామ్రాజ్యవాద ఛాయల్ని పరోక్షంగా వ్యక్తీకరిస్తాడు. మర మనిషి పేరుతో ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేసి లఘు, కుటీర పరిశ్రమల్ని, పారిశ్రామిక ఉత్పత్తుల్ని, శ్రామిక శక్తుల్ని ఏ విధంగా వర్గ దోపిడీ చేశాయో చిత్రిక పడతాడు.”మన హక్కు ఉక్కు” శీర్షికలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళాన్ని విప్పుతాడు నిశితాసి.

”వాయించు జముకు – పులిలా నీవు దుముకు

విశాఖ ఉక్కు మనదని – ఇది ఆంధ్రుల హక్కనిఅమ్మినోడు ఎవడని – కొన్నోడు ఎవడని” గేయ శైలిలో ఉద్యమ స్వరాన్ని పతాక స్థాయిలో ఎలుగెత్తి చాటిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ”సెగ” కవితలో చెప్పినట్టు సెల్‌ ఫోన్‌ సృష్టించే అశ్లీలత మాయాజాలం వ్యవస్థలో పరాకాష్టకు చేరుకుంది.

”ఇప్పుడు మావూరొక బుల్లితెర/ అశ్లీల సుధ అందాల సొదతేనెటీగల రొద/ శృంగారం సింగారించుకొని అంగాంగ ప్రదర్శన” చేస్తుంటే పెడతోవ పెట్టే యువతతోపాటు పిల్లల మీద కూడా అమిత ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ సందర్భాన్నే కవి ప్రస్తావిస్తాడు. ఇదే శీర్షికలో ఇంకోచోట వర్తమాన విషాద దృశ్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ఇలా చెబుతాడు :

”’సెజ్‌’లొచ్చాయి/ సజ్జలు తినేసాయి

జల కలకల జాడలేదు/ హరితవనాల ఊసులేదు” అనడంలో మెలిపెట్టిన మర్మాన్ని గమనిస్తే, ప్రయోజనాల కన్నా, ప్రతికూల వ్యతిరేక ఫలితాలే అధికంగా ప్రతిబింబిస్తాయి.

అభివృద్ధి పేరుతో పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా విస్తరీకరణ జరిగి, ప్రకృతి పచ్చదనాన్ని నియంత్రించే కాలుష్యం కోరల్లో ఆధునిక మానవుడు బందీగా మారుతున్నాడు. ‘సెజ్‌’ల పేరుతో కొండల్నీ, గుట్టల్నీ, పంటపొలాల్నీ దొలిచేస్తూ, భవంతులు కట్టడాల రూపంలో ప్రకృతి వినాశనానికి పెద్దపీట వేస్తున్న వైనం సరిదిద్దుకోలేని తప్పుగా పరిణమిస్తోంది. ఈ పోకడలో మార్పులు రావాలని ఆశించే గొంతుల్లో ఈ కవి కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఇలాంటి సందర్భాన్ని పోలిన మరో కోణాన్ని ‘మూత్ర గండం’ కవితలో బలంగా నొక్కి చెబుతాడు.

”గాలీ నేలా నీరు/ నీ పంచ ప్రాణాలు

కాలకూట విషం లాగ/ అవి కలుషితమవుతుంటే

లేత చిగురుటాకుల ఉద్దానమా/ పండుటాకులై రాలిపోవడమేనా” అంటూ ధ్వనించే స్వరంతో పర్యావరణ కాలుష్య తీవ్రతని, రాబోయే ముప్పుని ప్రత్యక్షంగా హెచ్చరిస్తాడు నిశితాసి. బతుకు పచ్చని బీల ప్రాంతమంతా మూత్రపిండాల వ్యాధి బారిన పడి అనారోగ్యానికి గురయ్యే నేపధ్యాన్ని సమస్యాత్మకంగా చిత్రిస్తాడు.

ఉద్దానం అనేసరికి బీల తీరప్రాంతం కళ్ళ ముందు మెదులుతుంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రంలో ఒక ప్రధాన పార్శ్వమైన చేపలవేట మత్స్యకారుల బతుకుల్లో దినదిన మృత్యుగండంగా రూపాంతరం చెందుతోంది. కెవిట్లు, కురవాకులు, వాడబలిజ, జాలర్లు ఇలా ఎందరెందరో తమ తెప్పలపై, మరబోట్లపై వలల్ని విసురుతూ నిత్యం బతుకు యుద్ధం చేస్తూనే ఉంటారు. ఈ ప్రకృతి విలయతాండవంలో అల్లకల్లోల సముద్ర కెరటాల ఉగ్రరూపానికీ, పోటెత్తే భీభత్సాలకీ వాళ్ళ జీవితాలు జీవన్మరణ ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ సందర్భాన్నే కవి కవిత్వమయం చేశాడు.

దళారోలు కొబ్బరి రైతుల జీవితాల్ని దోచుకొని దోపిడీచేసే తీరును ”కొబ్బరి రైతన్నా” శీర్షికలో అక్షరీకరిస్తాడు.

”దళారోలు దిగుతారు/ నిలువెల్ల దోచుకుంటారు

మహామాయగాళ్ళమ్మో/ మార్వాడీలొస్తారు

ఓరిమి కూరిమి చూపిస్తారు/ ఉన్నది పట్టుకుపోతారు” అంటూ జరిగే సామాజిక దోపిడీని బహిరంగంగా నిరసిస్తాడు. కనీస మద్దతు ధర పలకలేని ఒక నిస్సహాయ స్థితిలో అమాయక కొబ్బరి రైతుల మూగ వేదనని చారిత్రక సందర్భంగా గుర్తు చేస్తాడు రాజారావు.

సుబ్బారావు పాణిగ్రహి, గంటి రాజేశ్వరరావు, కొర్రాయి గణపతి, మార్పు పద్మనాభం, తరుణాచారి, గున్నమ్మ తదితరుల అలుపెరుగని పోరాటాలను కథల వ్యధలుగా చిత్రిస్తాడు. సమసమాజ స్థాపనకోసం వాళ్ళు చేసిన త్యాగాలను సజీవ దృశ్యాలుగా ఆవిష్కరిస్తాడు. కారంచేడు, వాకపల్లి, మణిపురి కన్నీటికథలు, ఛిద్రమవుతున్న వలస కూలీలు, జీడు, కొబ్బరి రైతుల జీవితాలు, ధర్మల్‌ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం వంటి అంశాలను ప్రస్తావిస్తాడు. వరద బీభత్సంలో భాగంగా తితిలీ, సునామీ, గోదారమ్మ లాంటి ప్రకృతి విలయ విపత్తుల్ని స్ఫురణకు తెస్తాడు. కరోనా రోజుల నాటి మృత్యు క్షణాల్ని భయకంపిత స్మ ృతులుగా నెమరేసుకుంటాడు.

ఈ కవ్వం చిలికిన కవిత్వంలో హృదయాన్ని తాకే వాక్యాలు ఎన్నో ఉన్నాయి. చదివి చవి చూడొచ్చు. ఉద్దానం సముద్ర తీరప్రాంత వాసుల సమస్యలనూ, కడగండ్లనూ బొమ్మ కట్టిస్తూ అక్షర రూపం ఇచ్చిన ‘కవ్వం’ గేయకవితా సంపుటిని, కవి నిశితాసిని పాఠకులు అభినందిస్తూ ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కవి సెల్‌ నెంబర్‌ : 97045 70198.

– మానాపురం రాజా చంద్రశేఖర్‌ 77940 39813

➡️