ఆశా దీపాల ముగ్గులు

Jan 15,2024 08:32 #sahityam

ముగ్గు, మగువల చేతి వేళ్ల నుంచి

జారిపడుతున్నట్టు కనిపిస్తుంది కదా!

కాదు.. ముగ్గంటే

ఆడవాళ్ళ అంతరంగపుటాకాశాల

నక్షత్రాల కాంతి ధూళి-

అది ఏడేడు లోకాల నుండి

ఈ నేలకు రాలి పడుతుంది

 

వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి

ఇంటి ముందు ఒక అమ్మాయి ముగ్గు పెట్టడం అంటే

ఆమె నడుం మీద వాలిన ఇంద్రధనస్సు

కిందికి తొంగి చూసి

సప్తవర్ణాలలో సంబరంగా నవ్వడమే-

 

పండగ నెల పట్టగానే కాల పురుషుడు

ముగ్గురాళ్లు పొడిచేసి ముదితలకు కానుకగా ఇస్తాడు

ఎన్నెన్ని యుగాలుగా వనితల స్వప్నాలు

ఎన్నెన్ని రంగుల్ని పోగేసుకుంటాయో

చెంగుచెంగున గెంతే

ఆ రంగుల కలలే ఈ రంగవల్లికలు-

 

ఇవి కేవలం ముగ్గులు కాదు

మట్టి దేహం మీద

అతివల ఆత్మ సంతకాలు

ఇవి నేల కాగితం మీద

మహిళల మహా రచనలు

ముగ్గులంటే

పడుచు పిల్లల కోటి కోటి జన్మల లేత లేత సిగ్గులు-

ముగ్గులంటే

సకల చరాచర సంసారం బుగ్గల మీద

అమ్మవ్వలు తీర్చి దిద్దే శుభాశీస్సుల

రంగుల ఉషస్సులు-

ఇంటి నుంచి ఇంటికి వీధి నుంచి వీధికి

ఊరు నుంచి ఊరికి

సకల సంతోషాల సంగమ సంగీతాల

వెన్నెల జల్లులే రంగవల్లులు

 

గీతలు గీతలుగా రేఖలు రేఖలుగా

రంగులు రంగులుగా

మనుషుల్ని కలపడమే

సంక్రాంతి ముగ్గు సందేశం

 

అనంత మానవలోక సుఖశాంతుల కాంతి కోసం

కేవలం స్త్రీలు మాత్రమే

ప్రపంచం వాకిలి ముందు

వెలిగించే ఆశాదీపాలు ఈ ముగ్గులు

–  ప్రసాదమూర్తి 8499866699

➡️