గుర్తింపు కోరవద్దు

Nov 26,2023 09:55 #Sneha
dont identify

సీతంపేట పచ్చని పంటలు పండే ఊరు. పాడికి కొదవే లేదు. అక్కడి ప్రజలందరూ కూడా బాగా తెలివైనవారు. ఒకరోజు పాఠశాల నుంచి వచ్చిన మధు ఎందుకో చాలా చిరాకుగా కనిపించాడు వాళ్ళ తాతయ్యకు. కాసేపు తన పక్కన కూర్చోబెట్టుకుని, ‘ఏమైంది’ అని అడిగాడు తాతయ్య.ఆ రోజు తన పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఓ సంఘటన చెప్పాడు. ‘ప్రార్థన నిర్వహించేటప్పుడు మా లెక్కల మాష్టారు పని చేస్తే మంచి గుర్తింపు ఉంటుందని చెప్తూ మా తరగతిలోని మూర్తిని మెచ్చుకున్నారు. అతను బడిలోని ఒక ఖాళీ స్థలంలో రెండు మొక్కలు నాటాడు. నేను రోజూ ఎంతో కష్టపడి పనిచేస్తే నన్ను మాత్రం పట్టించుకోలేదు. అందుకే నేను రేపటి నుండి ఏదో ఒక సాకు చెప్పి, స్కూల్‌ లీడర్‌గా తప్పుకుంటా. అప్పుడు ఆ పని వేరేవారు చేయలేక మళ్ళీ నన్నే రమ్మంటారు’ అన్నాడు.అది విన్న తాతయ్య నవ్వుతూ ‘నీ ఇష్టం’ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు తరువాత మధును పిలిచిన తాతయ్య ‘ఇంతకీ నువ్వు చేసిన పని వల్ల ఏం జరిగింది’ అని అడిగారు.మౌనం కాస్త వీడుతూ ‘నేను లేకపోయినా ఆ పని జరిపోతోంది’ అన్నాడు. ‘నీకో ముఖ్యమైన విషయం చెబుతా విను. ఈ ప్రపంచంలో ఎవరూ ఏం చేయకపోయినా ఏ పని కూడా ఆగదు. కోడి కూయకపోతే తెల్లవారదా.. చెప్పు’ అన్నాడు తాతయ్య.’మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు’ అన్నాడు మధు. ‘నువ్వు అనుభవం ద్వారా తెలుసుకుంటావని, మరొక్క విషయం.. మనం ఏ పనిచేసినా అది గుర్తింపు కోసం చేయకూడదు. అది కచ్చితంగా నీకు తృప్తిని ఇవ్వదు. నిజం చెప్పు! మూర్తి గుర్తింపు ఆశిస్తే ఆ మొక్కలు పెరిగి, పండ్లను ఇచ్చి వాడి ఆకలి తీరుస్తాయా?’ అన్నారు తాతయ్య.’అవును తాతయ్య మీరు చెప్పింది నిజమే. పని చేసి, ఫలితం ఆశించకూడదు. ఇకపై నేను కూడా మంచిపనులు చేస్తా’ అంటూ తాతయ్యను గట్టిగా హత్తుకున్నాడు.- సింగంపల్లి శేష సాయికుమార్‌,రాజంపేట, అన్నమయ్య జిల్లా.8639635907

➡️