సైన్సును నేను..

Dec 31,2023 11:43 #kavithalu, #Sneha

సైన్సును నేను

నిత్య చైతన్య శక్తిని నేను

విశ్వమంతా ఉన్నాను

వివేకవంతులకు కనిపిస్తాను

కాలంతో పాటే నేనూ..

కాలమే నేనూ!

ప్రశ్న అనే వాహనంపై పయనిస్తాను

ప్రశ్నించే మెదళ్లలో ప్రజ్వలిస్తాను

అణువులను ఛేదించాను..

విశ్వాంతరాళాన్ని శోధిస్తాను..

నీ చిటికెన వేలు పట్టి

చందమామపై అడుగుపెట్టించాను..

మార్స్‌ వైపుకు వడివడిగా

అడుగులేయిస్తున్నాను..

చక్రమై మారాను..

చరిత్ర గతిని మార్చాను..

రాళ్ళ రాపిడికి నిప్పయ్యాను

నీళ్ల వేగంతో విద్యుతై వెలిగాను..

వ్యాధి ప్రబలినపుడు వైద్యమై నిలిచాను

కరువు కాలంలో హరిత విప్లవమై ఆహారమిచ్చాను

మూఢత్వం మాడు పగలగొట్టాను

దురాచారాల దుర్నీతిని ఎండగట్టాను

దేవుళ్ళకు గ్రాఫిక్స్‌ మహిమలద్దిందీ నేనే..

మంత్రగాళ్ల మేజిక్కుల వెనకున్నదీ నేనే..

మేధావుల చేతుల్లో వెలుగు కాగడా అవుతాను

మూర్ఖుల చేతబడితే చితిమంటై మండుతాను..

ప్రశ్నిస్తే.. ప్రయోగమై నేను కనిపిస్తాను..

అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాను..

మతోన్మాదులతో నాకు.. పేచీ!

భౌతికవాదులతో నాకు దోస్తీ!!

నీ బుద్ధికి పదునుపెడితే..

ప్రశ్నించడం మొదలుపెడితే..

మోసాలేవో నీకు ఇట్టే తెలియజేస్తాను..!

సైన్సును నేను..!

నిత్య చైతన్య శక్తిని నేను..!

– రాము ఉప్పాడ

9676051509

➡️