మానవ సంబంధాల డొల్లతనాన్ని విప్పి చెప్పిన నవల

Feb 25,2024 12:27 #book review, #Sneha

ఇది కన్నడంలో రచయిత్రి గీత బి.యు.గారు రాశారు. వారు ఈ సబ్జెక్ట్‌ మీద ఒక ఏడాది పాటు శ్రమించి, ఎంతో విభిన్నంగా రాసిన నవల. అది సీరియల్‌గా వచ్చేటప్పుడు కన్నడ పాఠకులను విశేషంగా ఆకర్షించింది. నవలంతా సమాజంలో గృహహింస అనేది కేవలం స్త్రీల మీదనే కాదు. పురుషుల మీద కూడా కనిపించని రీతిలో కొనసాగుతుంటుందన్న దృక్కోణం నుండి రాయబడినట్టుగా పైకి కనబడినా.. అంతర్లీనంగా మానవ సంబంధాల మధ్య స్వార్థం పొరలు పొరలుగా పేరుకుని, సంబంధాల కొనసాగింపులో ఎవరి ప్రయోజనాలు వారికుంటాయన్న ఒక నిగూఢమైన సత్యాన్ని వ్యక్తం చేస్తుంది.

ఈ కన్నడ నవలను తన స్వంత నవలే అన్నంత అలవోకగా తెలుగు చేసిన కల్యాణీ నీలారంభం గారిని గురించి ఇక్కడ కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంది. వారితో పరిచయం ఒక్కనాటిదే అయినా, అది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. పౌరాణిక నేపథ్యం గల వారి అనువాద నవల ‘మాధవి’ చదివిన తరువాత ఏవిధంగానైనా వారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలన్న సంకల్పంతో వారిని కలిశాను. కల్యాణీ మేడమ్‌ నుండి అనేక సాహిత్య విషయాలను విని, తెలుసుకున్నాను.

కంచంలో వున్న అన్నాన్ని కలుపుకుని, ముద్ద పిసికి నోటికి అందించేలోపుగానే ఒక్కోసారి మనం ఊహించలేని సంఘటనల కారణంగా, ఆ అన్నం ముద్ద నేల పాలవుతుందన్నట్టు – ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ మేడమ్‌ ఏదోవిధంగా ఓపిక చేసుకుని, నవలను పూర్తిగా అనువాదం చేశారు. దాన్ని ముద్రణ కోసం పబ్లిషర్‌కి అందజేశారు. అయితే, ముద్రణ పూర్తి అయిపోయి పుస్తకం వెలుగు చూసేసరికి పాపం! కల్యాణి మేడమ్‌ కాలధర్మం చెందారు. ఆవిడ పుస్తకాన్ని చూసుకోకుండానే వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా వారికి మరో మారు నా హృదయపూర్వక అక్షరాంజలిని ఘటిస్తున్నాను.

ఇక నవలాంశం విషయానికొస్తే.. నవల ఉత్తమ పురుష కథన శైలిలో నడుస్తుంది. కథానాయకుడి పేరు పురుషోత్తమ. పేరుకు తగ్గట్టే మంచివాడుగా వుండడానికి శతథా పాకులాడుతుంటాడు. అతనో మధ్యతరగతి ఉద్యోగి. ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మధ్య వాడు. భార్య పేరు జానకి. వారికిద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అక్క అహల్య అమెరికాలోనూ, చెల్లి తార ఉన్న వూళ్లోనే బ్యాంక్‌ ఉద్యోగినిగా వుంటుంటారు. ఈ కుటుంబాన్ని ఆలంబనగా చేసుకుని పురుషోత్తం ఒక కొడుకుగా, ఒక సోదరుడుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఆఫీస్‌లో ఒక ఉద్యోగిగా ఏ పరిస్థితిలో? ఎవరితో? ఏవిధంగా ప్రవర్తించాలో, ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అర్థం కాక, చిక్కుపడిన నులక వుండ మాదిరిగా కుటుంబ బంధాల ఉచ్చుల్లో చిక్కుకుని, విలవిల్లాడి పోతుంటాడు.

సహజంగా మన పెద్దలు ‘ముల్లు వచ్చి అరటి ఆకు మీద పడినా, లేదా అరటి ఆకే వెళ్ళి ముల్లు మీద పడినా నష్టపోయేది అరటి ఆకే, అనే నానుడిని ఒక స్త్రీని ఉద్దేశించి ప్రస్థావిస్తారు. అయితే, ఆ నానుడికి భిన్నంగా, నిజానికి కుటుంబాల్లో మగవాడి పరిస్థితే అరటి ఆకు లాంటిదన్న సంఘటనల పేర్పుతో నవల ఆసాంతం పాఠకులను ఆశ్చర్యానికీ, ఆలోచనకూ లోనుచేస్తూ అశ్విక వేగంతో పరుగులు తీస్తుంది.

తను చెబుతున్నా లేదా తను ప్రస్తావిస్తున్న అంశానికి మరింత బలం చేకూర్చడానికా అన్నట్టుగా పురుషోత్తం పక్కింటి సుకన్య, ఆఫీస్‌లో అతని బాస్‌ ప్రతిభ పాత్రలను, వారి కుటుంబ పరిస్థితులను పట్టి చూపారు. వారిలో బాస్‌ ప్రతిభ పాత్రను మలచిన తీరు కొంత కృతకంగా అన్పిస్తుంది. ఫలితంగా మంచి నవల అనే మైసూర్‌పాక్‌లో పంటి కింద రాయి ముక్క తగిలినట్టుగా పాఠకులు భావించే ప్రమాదం వుందన్పిస్తుంది.

అయితే, ముగింపు దగ్గరకు వచ్చేసరికి చివరి ఇరవై పేజీల్లో పురుషోత్తం తండ్రి పాత్ర ద్వారా నేడు వృద్ధులైన తల్లిదండ్రులు, ముదిమి వయసులో ఎటువంటి అభద్రతా భావంలో కొట్టుకుపోతున్నారో? ఎంతటి మానసిక ఆందోళనలతో కుంగిపోతున్నారో? కుటుంబ బంధాల మధ్య ఎటువంటి మిథ్యా పూరిత విలువలు, ముళ్ళ కంపల దళ్ళు కట్టుకుని వుంటున్నాయో తెలిసి వస్తుంటే చదువుతున్న సహృదయ పాఠకుల కళ్ళు చిప్పిల్లిపోక తప్పదు.

ఒక మంచి నవల చదివితే హృదయం బాధతో మూలగాలి అన్న మాట ఈ నవల చదివితే ప్రతి ఒక్కరికీ తెలిసి వస్తుంది.

కాంతారావు శిరంశెట్టి

98498 90322

పబ్లికేషన్‌ : అనల్ప బుక్‌

కంపెనీ పేజీలు : 158

వెల : రూ.200/- లు

పుస్తకం కోసం సంప్రదించాల్సిన నెంబర్‌ : 709 3800 303.

➡️